Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దివ్యబాణచక్రప్రాస తీక్ష్ణశక్తి
శూలముఖ్యప్రయోగవిస్ఫురణ నెరపె.

195

భారత. కృష్ణుఁ డనెడుమాట. ప్రత్యర్థిభద్రవారణ = శత్రుశుభముల నివారించెడువాఁడా! ఘటోత్కచ - సంబుద్ధి. లసత్ = ఒప్పుచున్న, కంఠీరవమురీతిన్ = సింహముభంగిని, పొదలెడు నీవీరు = కర్ణుని, కుదియించి మనసేనఁ గావుము. అను = అనెడి, హరి = శ్రీకృష్ణునియొక్క, సార్థ = ప్రయోజనసహితములైన, వాక్యములు, రవిజున్ = కర్ణుని, తలపడఁ దెలుపునంతన, ఆనిశాటుఁడు = ఘటోత్కచుఁడు, అంగదన్ = వేడుకచేత, ధర్మనందనుఁడును, గంధవహజ = భీముఁడును, నాసత్యసుత = నకులసహదేవులును, చమూనాథ = ధృష్టద్యుమ్నుఁడును, ఆదిక = మొదలుగాఁ గలవారికి, పులకస్ఫూర్తి = రోమాంచమునకు - సంతోషాతిశయమున కనుట, కారణమైన, పొలుపుతోడ = వికాసముతోడ, దివసనాయకుపట్టిపైన్ = కర్ణునిమీఁద, కవిసి, ప్రాస = ఈఁటెలును, “ప్రాసస్తు కుంతః” అని అ. శూలమును, ముఖ్య= మొదలుగాఁ గల యాయుధములయొక్క, ప్రయోగవిస్ఫురణను నెరపెను.

రామ. ప్రత్యర్థి = శత్రువు లనెడి, భద్రవారణ =మత్తేభములయొక్క, ఘటా = సమూహములయందు, ఉత్క = వేడుకగలదై, చల = లంఘించుచున్న, సత్కంఠీరవమురీతిని. అను = అనెడి, హరిసార్థ = వానరసమూహముయొక్క, “సంఘసార్థౌతు” అని అ. రవిజున్ = సుగ్రీవుని, అంగద = అంగదుఁడును, ధర్మనందన = సుషేణుఁడును, గంధవహజ = హనుమంతుఁడును, నాసత్యసుత= మైందద్వివిదులును, చమూనాథ = నీలుఁడును, ఆది = ఆదిగాఁగల, కపులకు, అస్ఫూర్తికారణము = విచారహేతువు, దివ్య = దేవతలయొక్క, బాణచక్ర = బాణసమూహముయొక్క, ప్రాస = పోమొత్తుటయందు, తీక్ష్ణమైనశక్తిగల, శూలముఖ్య = శూలశ్రేష్ఠముయొక్క, కడమ సరి.

వ.

అతండును దానికిఁ జలింపక సుస్థిరుం డయ్యె నప్పుడు.

196

రెంటికి సరి సులభము.

తే.

అంతరమునంద యాశుగ సంతతివడి
నందికొని త్రుంచె దైత్యేరితాయుధమును
దనుజుఁ డపరిమేయపలాశి ఘనశిలాభి
హతి నినజు నుగ్రమన్యుమూర్ఛితునిఁ జేసె.

197

రామ. అంతరమునంద = నడుమనే, ఆశుగసంతతి = హనుమంతుఁడు, దైత్య = కుంభకర్ణునిచేత, ఈరిత = ప్రయోగింపఁబడిన, ఆయుధమును = శూలమును, త్రుంచెను. అపరిమేయపలాశి = అధికమాంసభక్షకుఁడు, దనుజుఁడు, కుంభకర్ణుఁడు, ఉగ్రమన్యున్ = అధికకోపము గలవాని, ఇనజున్ = సుగ్రీవుని, మూర్ఛితుని జేసెను.