Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భానుపుత్త్రాది = సుగ్రీవుఁడు మొదలుగాఁ గల, తత్పక్ష = ఆరామునికి సహాయమైన, “పక్షఃపార్శ్వగరుత్సాధ్యసహాయబలభిత్తిషు” అని వి. బలమును దఱిమి, ఆనృపునిన్ = ఆరామునిని, కడమ సమము.

తే.

ఏఁ గడఁగి యిట్లు గావింపనేని బెలుచఁ
జత్తు రుగ్రాజిభాసురజ్వలనమునకు
శలభత వహించి యాస్మాకసైన్యపతులు
విద్విషత్సైనికులు సముద్వీక్షఁ జూడ.

152

రామ. అస్మాక = మనసంబంధులైన, సైన్యపతులు, ఉగ్రాజియనెడి భాసురమైన, జ్వలనమునకున్ = అగ్నికి, శలభత వహించి, సముత్సంతోషయుక్తమైన, వీక్ష = దృష్టిచేత, విద్విషత్ = ఆరామునియొక్క, సైనికులు చూడఁగాఁ జత్తురు, ఇంకఁ దనవల్లఁ గాని జయము రాదనుట.

భారత. అస్మాకసైన్యపతులును విద్విషత్సైనికులును, సముద్వీక్షఁ జూడ = తల లెత్తి చూడఁగా ననుట, రుక్ = దీప్తులయొక్క, రాజి = పంక్తులచేత, భాసురమైన జ్వలనమునకు, కడమ సులభము.

వ.

అని పలికి పలికినట్ల బెట్టిదంపుఁ బెంపుసొంపు వొంపిరివోవ సన్నద్ధుండై
యుద్ధయాత్ర గావించి యావీరకంఠీరవుం డకుంఠవిక్రమోత్సేకం
బున ననేకయోజనవిస్తారదారుణంబుగాఁ బన్ని నపరబలవ్యూహం
బునందు సాహసోల్లాసభాసితశరాసనకళావిశేషంబున నీసు నెఱపు
చుం దెఱపి గొని రథంబు వఱపించి యొఱపుపఱపున నడ్డగించుపగఱ
యెడ్డుగడ్డుఱికి చించుకొని తనతోనే చొచ్చునిచ్చలంపుటెచ్చరిక
చాలక యక్కడక్కడం దలపడి వెలివెలిన పోరునిజయోధవీరులకు
దూరదృశ్యమానకేతనద్యోతనంబునం బ్రీతి యొసంగుచు నిశాత
నిజశరవాతపాతంబులచేత భూతలంబు ననవిరళంబుగా నొరగినహరి
కుంజరశతాంగశకలంబులచేత వికలత్వంబు నొందక యమందస్యం
దనప్రచారంబు సారథ్యాశ్చర్యచర్యామహిమ మహనీయహరి
నైపుణోద్దీపితాటోపంబై యేపుచూపం బ్రతాపంబు మెఱసి రణవిహ
రణరణరణికవిజృంభణాస్తంభసంభ్రమబంభ్రమ్యమాణచండకోదండ
దండకుండలీభావావినాభావసుభగంభావుకశరప్రయోగవేగచాతు
ర్యాశ్చర్యదశభుజయుగయుగళవిగళితాగళితజయదర్పవిభవుం
డగుచు నభినవసరణి నురవడించె నప్పు డప్పరబలంబునందుఁ
గొందఱు.

153