Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. వారల = రామలక్ష్మణులయొక్క, సంగరము = యుద్ధము, ఇట్టిది, అతిక్రూరమహాకపట-సంబుద్ధి. భవత్ = నీయొక్క, ఉరః = వక్షముయొక్క, దరవేళను = ప్రక్కలించునప్పుడు, ఎఱుఁగంబడదే = తెలియకుండెడినా.

వ.

అని పలికి యప్పుడు దన్నుం జుట్టుముట్టుకొని పట్ట నిగ్రహించుటకు
నుగ్రయోధుల నాగ్రహంబున నియోగించు నద్దురాత్ముదుర్వివేకంబు
నకు నవ్వి నిర్విశంకసమాకులితసంరంభవిజృంభితుం డై మేను వెంచి.

114

రెంటికి సరి సులభము.

చ.

తనువున సర్వలోకచయదర్శనచిత్రమహత్త్వ మెంతయుం
దనర విరాట్ప్రకారసముదంచితుఁ డై తనుఁ బట్టఁ గ్రమ్మువాం
డ్రను ఘనఘోరహుంకృతి నిరస్తులఁ జేసి నభోధ్వగామితా
భినుతయశోవిశేషమునఁ బేర్చుచు నేగె నియోక్తృపాలికిన్.

115

రామ. సర్వలోక = సకలజనులయొక్క, చయ = సమూహముయొక్క, దర్శన = దృష్టికి, చిత్రమైన మహత్త్వము తనర, విరాట్ = పక్షిరాజుయొక్క, ప్రకారముచేత, సముదంచితుఁడై = ఎగసినవాఁడై, నభోధ్వగామితా = ఆకాశగమనముచేత, నియోక్తృపాలికిన్ =రామునివద్దికి, ఏగెను.

భారత. తనువునన్ = దేహమునందు, సర్వలోకచయ = సమస్తజగత్తులయొక్కయు, దర్శన = చూపులచేత, చిత్రమైన మహత్త్వము, విరాట్ = విరాడ్విగ్రహముయొక్క, ప్రకారముచేత, సముదంచితుఁడై = ఒప్పెడువాఁడై, నభోధ్వగ = ఖేచరులచేత, అమితమానట్టుగా నభినుతమైన, నియోక్తృపాలికిన్ = ధర్మరాజుపాలికి, ఏగెను.

వ.

ఏగి యన్నరేంద్రునకుఁ దనపోయివచ్చినకార్యంబుతెఱం గెఱింగించి
యిట్లనియె.

116

రెంటికి సరి సులభము.

కవిరాజవిరాజితము.

తిరమువిపక్షుమదోద్ధతి నీవు దుదిం దెగఁ జాలవు గాని వెసన్
గురుకృపశాంతనవోక్తులఁ దేర్చియుఁ గొంకకయేని తవుం దగవున్
బిరుసును జూపి యనేకవిధంబులఁ బెక్కులు పల్కియుఁజూచితి నీ
కరుణకుఁ బాత్రుఁడు గాఁడు పదింబదిగాఁ గని వచ్చినవాఁడఁ దుదన్.

117

భారత. శాంతనవ = భీష్మునియొక్కయు.

రామ. గురుకృపన్ = అధికకృపచేత, తెగఁజాలవుగాని యని యన్వయము. శాంత = సరసములును, నవ = నవ్యము అనఁగా మనోహరములు నయిన, ఉక్తులను = మాటలచేత, కడమ యేకార్థము.