Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భీమ = భయంకరమైన, అర్జున = కార్తవీర్యార్జునునియొక్క, బాహుబలోద్ధామత = భుజబలిమి, నీ వెఱిఁగినదియ, ఆయనతో యుద్ధము చేసినవాఁడవు గనుక, తజ్జయ = ఆకార్తవీర్యుని జయించుటచేత, శాలిన్ = ఒప్పెడు పరశురాముని, శౌర్యోన్నతిచేన్ = బలిమిచేత, మించిన = జయించిన, మేటి రఘుపతి, అతనిఁ జెనకి బ్రతికెదే.

భారత. భీమ = భీమునియొక్కయు, అర్జునునియొక్కయు, బాహుబలోద్దామత = బలిమి, నీ వెఱిఁగినదియు, ఘోషయాత్రాగోగ్రహణాదులయందు, తజ్జయ = ఆభీమార్జునులవల్ల నైనజయములచేత, శాలిన్ = ఒప్పెడువాని, తాన్ = తాను, మిక్కిలియు శౌర్యోన్నతిచేతను, మించిన మేటి = అధికుఁడైన మేటి, అతనిన్ = ధర్మరాజును, చెనకి బ్రతికెదే.

చ.

విను పలుమాట లేల యలవేలుపుమూఁకలలోన నేనియున్
వెనుకకు వీఁగఁబాఱ కొకవీరుఁడు సైఁపగలాఁడె యల్క చూ
పినకులుఁ డించుకంత సమవేక్షితసంగరకేలి యై నిగు
డ్చినఁ బటుఘోరసాయకవిజృంభణ మన్యులకోర్వ నె ట్లగున్.

89

భారత. విను, అల్క చూపి = ఆగ్రహించి, నకులుఁడు, సమపేక్షిత = అపేక్షింపఁబడిన, సంగరకేలియై, యతిస్థానములకు “నపేక్షిత” యనుదిక్కున ఉపరిస్వరవర్ణయుక్తిను భయముఁ జెల్లునను లక్షణమువల్లఁ బకారమే యతిస్థానమై చెల్లెను.

రామ. విను, అల్కచూపు = ఆగ్రహదృష్టిని, ఇనకులుఁడు = రాముఁడు, ఇంచుకంత, అపేక్షితసంగరకేలియై నిగుడిచ్చిన నొకవీరుఁడు సైఁపగలాఁడె, సాయకవిజృంభణమును, అన్యులకున్ = ఇతరులకు, ఓర్వ నెట్లగును.

క.

తదనుజునిబాహుబలసం
పదయును సాయకవిహారపాండిత్యమహా
భ్యుదయమును బంటుతనమును
మదిఁ దలఁచిన గుండె వగులు మార్తుర కెల్లన్.

90

రెంటికి సరి సులభము.

ఉ.

నీవు మదుక్తనీతి మదినిల్పుము జీవితరక్షణార్థి వై
రావణదంతివాహను సురప్రభు గెల్చిన గెల్వవచ్చు దు
ర్భావవిచేష్టమానకురురాజకుమారకభీమబాహులీ
లావిధి కగ్గ మైన నవిలంఘ్యము నాకము సంధి మే లగున్.

91

రామ. రావణ-సంబుద్ధి, దుర్భావ = దుష్టస్వభావముయొక్క, విచేష్టమానక, ఉరు = అధికమైన, రాజకుమారక = రామునియొక్క, భీమ భయంకరమైన, కడమ సులభము.