Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. ఉపప్లావ్య = పీడింపఁదగిన, పురంబు, ఉపప్లావ్య = చుట్టుసముద్రముగల, పురంబు, రెండర్థములను లంకననుట, కడమ సమము.

వ.

అమ్మహానుభావుం డప్పుడు.

81


క.

నీతిమయిఁ దనకు భూమిజ
నాతతపరివాదభరనిరాతంకాత్ముం
డై తిరుగ విడువ కాజికిఁ
గౌతూహలి యగువిపక్షుగర్వము వినియెన్.

82

రామ. నీతిమయిన్ = నయమార్గమున, ఆతత = వ్యాపరించిన, పరివాదభర = అపవాదాతిశయమందు, నిరాతంక = భయము లేని, ఆత్మ గలవాఁడై, భూమిజను = సీతను, తిరుగవిడువక, ఆజికిన్ = యుద్ధమునకు, కౌతూహలియగు = వేడుకగల, విపక్షు = శత్రువైన రావణునియొక్క, గర్వమును వినియెను.

భారత. జనులచే, ఆతత = విస్తరింపఁబడిన, పరివాద, భూమిని దిరుగవిడువక, విపక్షు = దుర్యోధనునియొక్క, కడమ సమము.

చ.

సదయతఁ జేసి హింసలకుఁ జాలక యింకను మంచిమాటఁ దే
ర్చెద నని రాయబార మనిచెం దగ సంధివిధానచింతనం
గదురుచిరాభివర్ణ్యశమగౌరవకీర్తిజగంబు నిండఁ గో
విదనుతనీతిదక్షు హరివీరవరేణ్యు వచోవిచక్షణున్.

83

భారత. సంధివిధాన, చింతనను = చింతచేత, కదురు = పొందెడియనుట, చిరాభివర్ణ్యమైన శమగౌరవముచేతికీర్తి జగంబు నిండ, హరిని = కృష్ణుని, రాయబార మనిచెను.

రామ. చింతను, అంగదుని, రుచిరమైన యభివర్ణ్యమైన శమగౌరవముచేతికీర్తి = ఇటువంటి ద్రోహియందును దయదలఁచుచున్నాఁ డనెడుకీర్తి, హరివీరులలోన వరేణ్యుఁ డైనవాని, అనిచెను.

తే.

అతఁడు నుచితగతిభ్రాజి యై చని ప్రభు
చరితదుర్ణయవ్యధమానకరిపురజను
లనిశమును గుందువా రంతఁ దనదురాక
కార్య మెంచి యానీతిక కరము మెచ్చ.

84

రామ. ఆతఁడును = అంగదుఁడును, వృధను, మానక = విడువక, అరిపుర = లంకయందున్న, జనులు మెచ్చ, ఇట్టనునని ముందరిక్రియ.

భారత. అతఁడును = కృష్ణుఁడును, ప్రభుచరితదుర్ణయముచేత, వ్యధమాన = వ్యధ పడుచున్న, కరిపురమందలిజనులు మెచ్చ, కడమ సమము.