Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఉత్తరగోగ్రహరిపుసుమ, హత్తరవార్తాప్రచార మప్పురిప్రజకున్
దత్తామోదంబై బల, వత్తరతాపమును మదిని వర్తిలఁజేసెన్.

36

భారత. ఉత్తరగోగ్రహరిపు = ఉత్తరగోగ్రహణము చేసిన దుర్యోధనునియొక్క, వార్తాప్రచారము = వృత్తాంతము, అప్పురిప్రజకున్ = ఆవిరాటరాజు పట్టణములోనుండుజనులకు, దత్త = ఇయ్యఁబడిన, అమోదంబై = సంతోషరహితమై, బలవత్తరతాపమును, మదిని, వర్తిలఁజేసెను, మనసు కలఁగఁజేసె ననుట.

రామ. ఉ త్తరగ = ఉత్తరపుదిక్కుఁ గూర్చి పోవునట్టి, ఉగ్ర = భయంకరుఁడైన, హరిపు = వానరశ్రేష్ఠుఁడైన హనుమంతునియొక్క, సుమహత్తర= మిక్కిలిఁ దఱుచైన, వార్తాప్రచారము = ప్రసంగము, అప్పురిప్రజకున్ = లంకలోనివారికి, దత్తమైన, ఆమోదంబై = హర్షము గలదై, “ఆమోదో హర్షగంధయోః" అని అ. తాపమును, నివర్తిలఁజేసెను = పోఁజేసెను.

ఉ.

ఆతతవేగయానమున నంతట నావిలసద్బలుండు గో
త్రాతనయాభిదర్శనవిధానముదంచితవృత్తియై సము
ద్యోతిల నేగి కాంచి రయ మొప్పఁగఁ బల్కె నృపాలసూను ని
ర్ధూతతరాఘు నుత్తరుగురుస్ఫుటసంభ్రమచిత్తుఁ జేయుచున్.

37

రామ. ఆతతవేగ = అధికవేగము గల, యానమున = గమనము చత, ఆ, విలసద్భలుండు = లెస్సబలిమి గల హనుమంతుఁడు, గోత్రాతనయా = సీతయొక్క, “గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. అభిదర్శనవిధాన = సందర్శనవిధిచేతనైన, ముత్ = సంతోషముచేత, అంచిత = ఒప్పెడి, వృత్తియై = వర్తనగలవాఁడై, సముద్యోతిల = సముద్యోతించునట్టు, నృపాలసూనుని = రాముని, నుత్త = పోమొత్తఁబడిన, రుక్ = తాపముగలదై, ఉరు = ఘనమునై, స్ఫుటమైన సంభ్రమము గలచిత్తము గలవానిఁగాఁ జేయుచును బల్కెను.

భారత. ఆతతవేగ, యానమునన్ = రథముచేత, “యానం గతౌ వాహనేచ” అని వి. ఆవిల = మందమైన, సద్బలుండు = సత్త్వముగలవాఁడు, గోత్రాత = గవాధ్యక్షుఁడు - కీలారము పారుపత్తెము గలవాఁ డనుట, నయ = నీతిచేతనైన, అభిదర్శనవిధానము, నయ మనఁగా ద్వారపాలాదుల యవసరణము, ఉదంచితమైనవృత్తియై = మర్యాద గలదై, సముద్యోతిలక్ = శోభిల్లగను, ఏగి, కాంచి = పొడగని, నిర్ధూతతర = మిక్కిలి లేని, అఘు = దుఃఖము గలవాని, ఉత్తరుఁడనెడు విరాటపుత్త్రుని, గురుస్ఫుట = మిక్కిలిఁ బ్రకాశమైన, సంభ్రమ = ఆగ్రహముగల, “సమౌ సంవేగసంభ్రమా" అని అ. చిత్తము గలవానిఁగాఁ జేయుచును పల్కెను.