Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లను, అర్జునుఁడును, గాంధర్వగతిశిక్ష = అశ్వసంబంధమైన గమనశిక్షను, కావించునెడలను, నకులుఁడును, “వాజివాహార్వగంధర్వ వాయసైంధవసప్తయః” అని అ. అత్యంత, మాహా = ఆవులయొక్క, “గౌరుస్రా మాహా చశృంగిణీ" అని అ. రక్షణాదివిధులఁ గ్రాలునెడలును, సహదేవుఁడును, క్రమమునఁ గాంచి, తత్తదర్హగతిన్ = అందుకందుకుఁ దగినరూపవర్తనలచేత, అయంబు మీఱన్ = భాగ్యవశమున నన్నియు నిచ్చానుకూలమౌచునుండఁగా ననుట. నవమైన, నిజ = స్వకీయమైన, అతను = అనల్పమునైన, నైపుణీ = నేర్పుయొక్క, వివృతిన్ = విశేషగోపనముచేత, మెఱసి, పరు లెఱుఁగకుండ, ఏగురు = అయిదుగురును, ఆశ్రయించిరి.

క.

అంతటఁ దద్రామ నృపతి
కాంతాసందర్శనాభికాంతాసహిత
స్వాంతతఁ దరియించుచు శు
ద్ధాంతక్రీడావనస్థ యగుతద్దేవిన్.

140

భారత. అంతట, తద్రామ = ద్రౌపది, నృపతికాంతా = సుధేష్ణయొక్క, కడమ సులభము.

రామ. అంతట, తద్రామనృపతికాంతా = సీతయొక్క, కడమ సరి.

క.

చేరి పొడగాంచి యాయమ
చేరిక నతిగూఢతను భజించి వసించెన్
సైరంధ్రీభావమునఁ ద
దారూఢప్రీతి మొగము దగఁ గైసేయన్.

141

రామ. చేరి పొడగాంచి, ఆయమ = సీతయొక్క, చేరికను, సైరంధ్రీభావమునన్ = సైరంధ్రియొక్క రీతిచేత - సైరంధ్రీభావనలచేత ననుట. తదా = అప్పుడు, రూఢ = మొలిచిన, ప్రీతి = సంతోషము, మొగము దగఁ గైసేయ = సీతాసందర్శనమువల్ల నైన వేడుక ముఖమునకు శృంగారము దేఁగా ననుట.

భారత. సైరంధ్రిత్వము, మొగము దగఁ గైసేయ = తిలకాదులు పెట్టునట్టుగా, ఆయమ = సుధేష్ణయొక్క, చేరికను వసించెను.

శా.

పారేమాయవిజృంభమాణపరమబ్రహ్మాత్మ మధ్యేహృద
బ్జారాధ్యామలదివ్యమంగళనిజాంగాజస్రసాక్షాత్క్రియా
ధౌరంధర్యమహత్త్వపాత్రితగుణాధరఃకారితాష్టాంగయో
గారూఢిప్రథమానమౌనిజనభాగ్యశ్రీసముజ్జృంభణా.

142

పారేమాయ = మాయ నతిక్రమించినతర్వాత, “పారే మధ్యే షష్ఠ్యావా” అని షష్ఠీసమాసము. విజృంభమాణ = ప్రకాశించుచున్న, పరమబ్రహ్మాత్మ = నిర్గుణబ్రహ్మ