Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. శివతేజోమయస్వరూపుఁడై = రుద్రవీర్యజనితుఁడై, వెలయు, హరి = వానరుఁడు - హనుమంతుఁ డనుట. ఆత్మేశుఁడు = సుగ్రీవుఁడు, అనుపఁగా, ఆభవ్యున్ = రాముని, అరయన్ = తెలియ వచ్చెను.

భారత. శివ = శుభమైన, “శ్వశ్రేయసం శివం భద్ర” మని అ. తేజోమయ = జ్యోతిర్మయమైన, స్వరూపముగలవాఁడు, హరి = శ్రీకృష్ణుఁడు, ఆత్మ = జీవులకు, ఈశుఁడు = కర్త, అనుపమ = సరి లేని, కడమ సులభము.

క.

వచ్చి తగురీతి దర్శన
మిచ్చి తదీయ మగువృత్త మెల్ల వినియెఁ దాఁ
జెచ్చెరఁ గుశలప్రశ్నస
ముచ్చారణపూర్వకముగ నుచితప్రౌఢిన్.

105

భారత. సులభము.

రామ. తదీయమగు = ఆరామునిసంబంధమైన, వృత్తమెల్లన్ = దశరథుఁ డంపినది మొదలుకొని యావఱ కయినవృత్తాంతమంతయు, తాను వినియెను, కుశలప్రశ్న = నేర్పుగా క్షేమవార్త నడుగుటయొక్క, సముచ్చారణవాక్యపురస్సరముగా.

క.

విని తనదువృత్త మంతయు
వినిపించి పరస్పరార్హవిధి నిష్టాలా
పనిరూఢి జరుగ నపు డా
తనిమది మాటబడిఁ దెలిసి తనమదిలోనన్.

106

రెంటికి సరి.

చ.

అనిమిషరాట్తనూభవభుజాతిశయప్రతికారనిత్యచిం
తను రవినందనుం దనకు నచ్చిన బంటుగ నేలి తత్ప్రియం
బనయము సల్పుచుం బ్రబలు నాత్మరిపుం దుదిఁ దా జయింపఁ జా
ల ననుమతి సృజించుట యలంఘ్యత నీతనియందుఁ దోఁచెడున్.

107

రామ. హనుమంతుఁ డెంచినప్రకారము, అనిమిషరాట్తనూభవ = వాలియొక్క, భుజాతిశయ = బాహుబలిమియొక్క, ప్రతికార = ప్రతిక్రియయందుఁ గల, నిత్యచింతను = నిత్యవిచారము గలవాని, రవినందనున్ = సుగ్రీవుని, బంటుగ నేలి, తత్ప్రియంబు = ఆసుగ్రీవునికిఁ బ్రియమును, సల్పుచు = చేయుచు, ప్రబలున్ = బలవంతుఁడైన, ఆత్మరిపున్ = రావణుని, తుదిన్ = ఆతర్వాత, జయింప = సంహరించుటకు, చాలన్ = మిక్కిలి, అనుమతిన్ = అనుసరించినబుద్ధితోడ, భజియించుట దోఁచెడును.

భారత. అనిమిషరాట్తనూభవ = అర్జునునియొక్క, భుజాతిశయప్రతికారముయొక్క, నిత్యచింత = నిత్యవిచారముచేత, రవినందనున్ = కర్ణుని, నచ్చినబంటుగ నేలి =