Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యర్థాలంకారముల విచారించెద. సుకవులు శబ్దాలంకారముల నంతగ నాదరింపరని చిత్రమీమాంసలో శ్రీమదప్పయదీక్షితులవారు “శబ్దచిత్రస్యప్రాయో నీరసత్వాన్నాత్యంతం త దాద్రియంతే కవయో నవా తత్ర విచారణీయ మతీవోపలభ్యత ఇతి శబ్దచిత్రాంశమపహాయార్థచిత్రమీమాంసా ప్రసన్నవిస్తీర్ణా ప్రస్తూయతే" అని చెప్పియున్నారు గదా.

క.

"వెండియుఁ బతికోర్కి వొదల, రెండవసతి యనవరగుణరేఖఁ దనరుచున్
గండెసఁగెడు సుతరత్నముఁ, బాండురమణి శుక్తివోలెఁ బడసె హరికృపన్.”

ఆ-1. ప-72.

ఇం దుపమాలంకారము స్పష్టము. భారతార్థమున రూపకసంకీర్ణ మగుట విశేషము.

మ.

"తలపం జొప్పడి యొప్పెనప్పుడు......."

ఆ-1. ప-9.

అని ముందు వృత్త్యనుప్రాసోదాహరణముగాఁ జూపఁబడినపద్యమందు సంబంధాతిశయోక్తివస్తూత్ప్రేక్షలు రెండు గోచరించుటంజేసి వానికిఁ గ్రమమున నంగాంగిభావలక్షణం బైనసంకరమును దీనికిని శబ్దాలంకార మగువృత్త్యనుప్రాసమునకును సంసృష్టియు విపశ్చిద్వివేచనీయంబులై తోఁచెడు.

చ.

“తురగఖురాహతక్షితిజధూళిచయస్థగితాంబరంబుతో
నొరయుచుఁ దచ్చమూగజసముత్కర మప్పుడు చూడ నొప్పె ది
క్కరివరయూథమత్సరవిగాఢతఁ జేసి సమస్త మైనయి
ద్ధరఁ దనపైకి నెత్తుకొని తాల్చెడినో యనుచుండఁ జూపరుల్."

ఆ-1. ప-10.

ఇందు సంబంధాతిశయోక్త్యనుప్రాణితహేతూత్ప్రేక్ష —

సీ.

"అచ్చంపులేఁజిగురాకుజొంపము కెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ
గ్రుచ్చినట్టుగ జాదుకొన్న మొగ్గలగుంపు, ప్రకటపాటలబిందుపాళి గాఁగ
విచ్చినపరువంపువిరులతండము పెంపు, శోభితభూతిరింఛోళి గాఁగ
నిచ్చలం బైన తేనియవానజడిసొంపు, లాలితదానధారాళి గాఁగ


తే.

సుమపరాగముల్ కేళిపాంసువులు గాఁగ
భ్రమరపఙ్క్తులు పైసరఫణులు గాఁగఁ
బుడమినెల్లెడ వాహ్యాళి వెడలుమదను
మదపుటేనుఁగువోలె నామని దనర్చె.”

ఆ-2. ప-5.