పుట:రమ్యా లోకము.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము



లాలనీయమౌ శిశువు వాలకమునందు
సమసుఖార్తి భాగినియైన సఖిముఖాన
ద్యోతమయ్యెడు అవితథయోగమై స్ఖ
లింపని ప్రసన్న శృంగార లీడరేఖ.

తల్లి పక్షఃస్థలంబున స్తన్యమాని
నిరవధికతుష్టి విశ్వమే మఱచు శిశువు
క్షీరకోమల గండశృంగార చుంబ
నముల నొదవెడు తల్లికిన్ ప్రమదపులక.

బలవదమలానురాగ తపఃప్రభగ్ను
డయిన సఖుని ఆశాదీప మాఱకుండ,
తన నయస్నేహ శృంగార ధారబోయు
పరమసౌందర్యనిధియైన ప్రాణసఖియు.

స్నేహ సురత వాత్సల్యముల్ జీవితమున
ప్రేమ కంగంబులగు, అంగి ప్రేమ యొకడె;
ప్రేమ శిఖరావరోహణాభిజ్ఞు లయిన
మృదు సహృదయల కివియెల్ల మెట్టులగును.

38