పుట:మ ధు క ల శ మ్.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుకలశమ్


                 19

కలకలనవ్వు తేటసొనకౌగిట నూగుచు బాలపల్లవాం
గుళి బ్రతిమాలు ఈహరితకుంజలతన్ కదిలింప కంతగా;
కలికి ! నఖక్షతిన్ మధువు గ్రక్కని యేచెలి కావిమోవి ఈ
చెలియలి తీవెకున్ మనసుచెల్లని ముచ్చట లప్పగించెనో.



                  20

గతదివసప్రపీడనయు గాఢభవిష్యదపోహభీతియున్
హత మొనరింపజాలు మధు వందపుగిన్నియ నిండ నింపు; మీ
వితమున రేపురేపని తపించెద వుగ్మలి ! యెన్ని 'రేపు' లీ
క్షితిపయి 'నిన్న'లందు గలసెన్ గతకాలమయాబ్దరాశిలోన్.



                  21

నయమతు లాప్తు లార్ద్రసుమనస్కులు నౌమసమిత్రు లెంద రీ
ప్రియమగు తోటలో తమయదృష్టవశమ్మగు ద్రాక్షపండ్లు పిం
డి యొకటి రెండుగిన్నియలు నిండుగ ద్రావి, విరామలాలసా
శ్రయు లయిరో సఖీ ! యొకరు జాఱగ నొక్కరు తోడుతోడుగన్.

27