Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, గీతాశాస్త్రం). ఈ సిద్ధాంతానికి తొలి ప్రవర్తకుడు రామానుజులు. తన వేదాంత సంగ్రహానికి శ్రీభాష్యం (వేదాంత సూత్ర వ్యాఖ్య) అని పేరు. తన సిద్ధాంతానికి ఆధారం ప్రాచీన గురువు బోధాయన వృత్తి, అంతకుముందున్న ద్రవిడక గుహదేవ నమ్మాళ్వారు బోధనలు ఆధారాలు. శ్రీవైష్ణవ ఉత్తమభక్తుడు క్రీ.శ. 824లో నాథముని ఆళ్వారుల దివ్యగీతాలను వేదాంత ఉన్నతికి చేర్చి ఉభయ వేదాంతం అను పేర వ్యాప్తిలోకి తెచ్చాడు. నాథముని మనుమడు అల్వాందార్ పాంచరాత్రంనకు, వేదాంతమునకు కీర్తి తీసుకొచ్చాడు. తరువాత రామానుజులు క్రీ.శ. 1017లో ఆల్వంచారు వేదాంతానికి అనుయాయి. రామానుజులు తన ప్రేమతత్త్వము గూర్చి ఆ తత్త్వశాఖకు నూతనాధ్యాయాన్ని, నవ్యతను చేకూర్చి సత్యతను నిర్ణయించారు ".11

రామానుజాచార్యులు స్త్రీ-పురుష, పండితపామర, కుల, జాతి, వయోబేధాలకు అతీతంగా భక్తిమార్గాన్ని, ప్రపత్తిమార్గాన్ని ప్రబోధించవలసి వచ్చింది. ఆయన కృషి కారణంగానే యజ్ఞయాగాలు, కర్మకాండ, జ్ఞానకాండ మొ॥న వాటితో ప్రమేయం లేకుండా భక్తిమార్గం భారతదేశమంతటా సర్వజనులకు అవలంబనీయమైనది".12

భారతదేశం అంతా పర్యటించి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసి, శూద్రులకు, దళితలకు మత దీక్ష యిచ్చాడు. తరువాతి కాలంలో తెంగల్, వడగల్ శాఖలుగా వీడిపోయి ఆంధ్రదేశంలో వైష్ణవ మతం క్రీ.శ.11వ శతాబ్దం నుండి వైష్ణవ మతాలు ఉన్నట్లు చరిత్ర ఆధారాలనుబట్టి తెలుస్తోంది. ఇది రామానుజాచార్యుల ప్రచారంతో మరింత బలపడింది.

6. వైష్ణవ మతం - వికాసం

భారతదేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నప్పటికి దేనికదే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ అనేక మార్పులు చేర్పులకు గురౌవుతూ నేటికీ అమలులో ఉంది. వైష్ణవులు భగవంతుని ఆరాధించే పద్ధతుల్లో స్వల్పమైన భేదాలున్నప్పటికి ఇంచుమించు అందరూ అనుసరించే పద్ధతుల్లో ఏకరూపత కన్పిస్తుంది. “శ్రీవిష్ణువుకు" దాసులుగా ఉండి భగవంతునికి సేవ చేస్తూ మోక్షమార్గం పొందడమే వైష్ణవుల కర్తవ్యం. శ్రీమహావిష్ణువుని సుప్రభాతంతో నిద్రలేపి రాత్రివరకు స్వామివారిని నిద్రపుచ్చేంత వరకూ సేవచేయడం ఎంతో భాగ్యంగా శ్రీవైష్ణవులు భావిస్తారు. వైష్ణవులు స్వామిని ఆరాధించే సంప్రదాయం ప్రకారం బంగారంతో గాని, రాగితోగాని, వెండితోగాని శాస్త్రప్రకారం శంఖుచక్ర ముద్రలు వేసుకోవాలి. పుండ్రాన్ని ధరించటం, మంత్ర పఠనం, ధ్యానం, నామస్మరణ, సంకీర్తనం, వందనం, తీర్థసేవనం, ప్రసాదం, భక్తిసేవనం, ద్వయాను సంధానం, తులసీరోహణం, తులసీదళ భక్షణం ఈ విధమైన పంచ సంస్కారాలు ఆచరించేవాడే వైష్ణవుడని వీరి విశ్వాసం. పంచ సంస్కారాలు ఆచరించిన వైష్ణవుడు ఏ కులానికి, ఏ జాతికి సంబంధించిన వాడైనా కూడా పుణ్య పురుషుడేనని పురాణాలు చెబుతున్నాయి .13

32