Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పరిచయం

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతాన విశేషంగా బ్రహ్మవాదాలు కొన్ని వెలసిల్లాయి.ఈ బ్రహ్మవాదాలను ఆళ్వారులు తమ దివ్య ప్రబంధాలలో ప్రస్తావించటమేకాక ఈ భగవద్గుణాలను, స్తోత్రాలను మొదలైన వాటిని అత్యంత మనోహరమైన శైలిలో గానం చేసి మనదేశంలో విష్ణు భక్తితత్త్వం నశించిపోకుండా నిలబెట్టినవారు పన్నెండుమంది ఆళ్వారులు. వీరు కారణ జన్ములు. ఈ పన్నిద్దరు ఆళ్వారులను 'ద్వాదశసూరులు' అని కూడా వ్యవహరిస్తారు. పన్నిద్దరు ఆళ్వారులలో దాదాపు శూద్రులుండటం గమనార్హం. 'సూరి' అనగా మోక్షస్థానమైన విష్ణులోకంలో నిలిచి ఉండే విష్ణుదేవుని నిత్యము దర్శించే భగవంతుని పరివారంలోని వారని అర్థం.

శ్లో॥ తద్విష్ణోః పరమంపదం సదా పశ్యతి సూరయః” (విష్ణు సూక్తం)

అనగా నిత్యము (సదా) విష్ణులోకంలో (పరం-పదం) భగవంతుడిని (విష్ణోః) దర్శించుతూ (పశ్యంతి) ఉండే వారే ఈ దివ్యసూరులు అని భావము. భూమి పై కారణజన్ములుగా అవతరించిన పన్నెండుగురు ఆళ్వారులచే పరంపరంగా విష్ణుభక్తిని తెలిపే భాగవత ధర్మము అన్న వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రబోధించబడింది. దీనినే భగవద్రామానుజులు ప్రపంచానికి ఉపదేశించారు. కాబట్టి, రామానుజుల ఉపదేశమును గ్రహించాలంటే ఆళ్వారులు భక్తి తత్త్వ పరంపర గురించి తెలుసుకోవాలి.

2. వైష్ణవ వ్యుత్పత్తి అర్థం

వైష్ణవ మతం అను వాక్యం రెండు అర్థాలతో ఉన్నది. మొదటిది వైష్ణవ అను పదము “మతము”. ఇందులో 'వైష్ణవ' అను పదం 'తసేద్యం' అను పాణినీయ సూత్రం (అష్ట 4-3-120) అనుసరించి విష్ణోరిదం వైష్ణవం అను వ్యుత్పత్తిచే విష్ణువుకు సంబంధించిన మతమని స్పష్టమవుతుంది. ఈ విష్ణు శబ్దము సువర్ణ, సుధాకరాది శబ్దములవలె, స్వార్థమందలి మహత్వమును, సర్వవ్యాపకత్వాన్ని ప్రబోధిస్తూ సర్వేశ్వరుని యందు రూఢమై ఒప్పుచున్నది.

27