Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షగాన సంప్రదాయానికే చెందుతుంది. తూర్పు భాగవతం, కుప్పం నాటకం కూడా భిన్నమైన యక్షగాన సంప్రదాయాలు. చిరుతల యక్షగానం అనే ప్రక్రియ చాలా భిన్న శైలిలో ఉంటుంది. యక్షగానంలో పాత్రలు వేసే కళాకారులు అందరూ కూడా చిరుతలు ధరించి వాయిస్తూ పాట పాడుతూ కథను చెప్తూ ఉంటారు. వీరు చుట్టు తిరుగుతూ ఉండగా సంభాషణలు ఉన్న పాత్రలు మాత్రమే మధ్యకు వచ్చి పాడుతూ కథను చెబుతూ ఉంటారు. పాత్రలన్నింటికీ ఆహార్యం ఉంటుంది. ఇది తెలుగువారికే సొంతమైన ప్రత్యేకమైన జానపద ప్రదర్శన కళా సంప్రదాయం. ప్రాచీన కాలంనుండి జానపద ప్రదర్శన కళలో మనిషి సాధించిన సాంకేతికతకు ఉదాహరణప్రాయంగా కనిపిస్తూ అతను ఈ కళా సంప్రదాయాలలో సాధించిన విజ్ఞానానికి ప్రతీకగా కనిపించే కళారూపాలు తోలుబొమ్మలాటలు. దీన్ని ప్రాచీన కాలపు సినిమాగా చెప్పవచ్చు.

ఒక కథను మానవ పాత్రలతో ప్రదర్శించడం మొదటి ఆలోచన అయితే కథను మానవ పాత్రలతోనే కాకుండా మానవులు చేసిన బొమ్మలతో కథను ప్రదర్శించడం అనే ఆలోచన మానవుడి అభివృద్ధిచెందిన సాంకేతికతకు కళా తృష్ణకు సంకేతంగా చెప్పదగిన విషయం. ఇలాంటి కళారూపాలు తోలుబొమ్మలాట చెక్కబొమ్మలాట కళారూపాలు. జానపద కళా ప్రదర్శనలో మనిషి సాధించిన ప్రగతికి ఇవి మచ్చుతునక. తెలుగు వారికి ఈ రెండు కళాప్రదర్శన సంప్రదాయలు ఉన్నాయి. తెలుగునాట తోలుబొమ్మలాటలు చెక్కబొమ్మలాటలు కనీసం 12 వ శతాబ్దినుండి ఉన్నాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లభించాయి. తోలుబొమ్మలాట సంగీతరీత్యా సాహిత్యరీత్యా పాత్రలు మనుషులకు బదులుగా బొమ్మలు ఉంటాయి. తోలుబొమ్మలాటలు ప్రదర్శించే వారు తొలినాళ్ళలో తెలుగు వారే ఉండేవారేమో చెప్పలేము కాని కాలంలో కనిపించే తోలుబొమ్మల కళాకారులు అందరూ మరాఠీ భాషను మాట్లాడే ఆరె మరాఠీలు అనే తెగకు చెందిన మరాఠా ప్రాంతానికి చెందిన వారు. మనకు నాటక ప్రక్రియ కూడా మహారాష్ట్రనుండి కొంత వలస వచ్చిన సంగతి తెలిసిందే. జానపద కళలు ప్రయాణం సహజంగా జరిగిన ప్రక్రియ వీరు మాతృభాష మరాఠీ అయినా కూడా వీరి ప్రదర్శనలో వీరు మాట్లాడే తెలుగులో ఏమాత్రం మరాఠీ యాస కనిపించదు. తెలుగు మాతృభాషగా ఉన్న వారి తెలుగు ఎలా ఉంటుందో అలాగే వీరి తెలుగు ఉంటుంది. కొన్ని శతాబ్దాలుగా వీరు ఇక్కడ ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది. రామాయణ భారత కథలను వీరు ప్రదర్శిస్తున్నారు. ఇక చెక్కబొమ్మలాట విషయానికి వస్తే దీని కళాకారులు అందరూ తెలుగువారు. తెలుగునాట దళిత కులాల ఉపకులాలలో ఒకరైన వారు. వీరిని బుడిగజంగాలు అని అంటారు. కాని బుడిగ జంగాలు అందరికీ వృత్తి లేదు. అందుకే వీరిని బొమ్మలోళ్ళు అని ప్రత్యేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. చెక్క బొమ్మలాట కూడా 12 వ శతాబ్ది నాటికే ఉందని చెప్పడానికి ఆధారాలు లభించాయి. వీరికి అవసరమైన చెక్క బొమ్మలు తయారు చేసిన

171