ఇలాంటి కళారూపాలు తెలుగులో కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగులో ఉన్నన్ని ఇలాంటి కళారూపాలు భారత దేశంలోని ఇతర భాషా ప్రాంతాలలో ఉన్నాయే లేదో చెప్పడం కష్టం. ముగ్గురు కళాకారులు ఉండి కథను ప్రదర్శించడంలో చాలా సౌకర్యం ఉంటుంది. సంభాషణలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను వహించి మాట్లాడతారు. పాటలో కథను చెప్పే సందర్భంలోనూ ఇలా వివిధ పాత్రలను ఆ కళాకారులు అన్వయించుకొని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ప్రేక్షకులకు ఇక్కడ కథ బాగా దృశ్యమానం అవుతుంది. ఏక వ్యక్తి ప్రదర్శనలతో మొదటగా ప్రారంభమైన జానపద ప్రదర్శన కళాసంప్రదాయం ఇక్కడి ప్రదర్శన సంప్రదాయ విస్తృతిలో పరిణతి చెందినదని చెప్పడానికి వీలుంది. సంపూర్ణమైన నాటకం దిశలో ఇక్కడ కొంత పరిణితమైన రూపం ఏర్పడే ఉందని చెప్పొచ్చు ఆస్కారం ఉంది. తెలుగువారి జానపద కళా సంప్రదాయాలలో ఇలాంటి ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఉండే కళారూపాలు మంచి పరిణతి చెందినవిగా కనిపిస్తాయి. వీటికి తొలిగా చెప్పవలసిన కళారూపం శారదకథ. దీన్నే జంగం కథ అని కూడా అంటారు. ఈనాడుమ ఉన్న బుర్రకథా కళారూపానికి ఇది ఆదిమ రూపం ఆధార రూపం. దీనిలో ఒక ప్రధానకథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. కథాగానాన్ని ప్రధానంగా కథకుడే చేసినా కథావిస్తృతి మాత్రం ముగ్గురి ద్వారా జరుగుతుంది. ముగ్గురి మధ్యన జరిగే సంభాషణల రూపంలో కథావ్యాప్తి ఉంటుంది. ఇలాంటి కళారూపాలకు ఉదాహరణలుగా, ఆసాదికథ, పిచ్చుకుంటికథ, పాండవులకథ, గొల్లసుద్దులు, ఒగ్గుకథ, వంటి అనేక కళారూపాలను చెప్పవచ్చు.6
జానపద ప్రదర్శన కళాసంప్రదాయాలలో మరొక విశిష్ట శైలి తెలుగు వారికి ఉంది. ఇలాంటి ప్రదర్శన సంప్రదాయాలు మరే భాషాప్రాంతాలలో ఉన్నాయో ఇంకా తెలుసుకోవలసి ఉంది. ఒక చిత్రిత పటాన్ని ప్రదర్శిస్తూ పైన చెప్పిన ముగ్గురు కళాకారులు కలిసి కథాగాన ప్రదర్శన చేయడం ఇక్కడి ప్రత్యేకత. కళాకారులు చెప్పే కథను ఒక గుడ్డమీద చిత్రిస్తారు. ఈ గుడ్డ నాలుగు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. 40 నుండి 50 అడుగుల పొడవులో చుట్ట చుట్టి ఉంటుంది. ఈ చుట్టను సమాంతరంగా ఉన్న రెండు గుంజల పైన అమర్చి పటాన్ని విప్పుతూ ప్రధాన కథకుడు చిత్రించిన బొమ్మలను కర్రతో చూపిస్తూ కథను పాడడం వివరించడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. వేలాడ దీసిన పటానికి ముందు వీరు నిలబడి కథను సంగీత వాద్యాల సహాయంతో ప్రదర్శిస్తారు. కథకుడు వంతలు సంగీత వాద్యాలు పైన చెప్పిన శారదకథ వంటి కళారూపాలలో ఉన్నట్టు ఉన్నా పట ప్రదర్శన ఇక్కడి కళాప్రదర్శనలో ప్రత్యేకత. ఇలాంటి కళారూపాలు తెలుగు వారికి చాలా ఉన్నాయి. చాకలి పటం కథ, గౌడజెట్టి పటం కథ, డక్కలి పటం కథ, కూనపులి పటం కథ ఇందుకు మంచి ఉదాహరణలు గొల్లలకు కథలు చెప్పే తెరచీరలవారు అనే కళాకారులు కూడా చిత్రిత పటాన్ని ఆధారంగా చేసుకొనే కథలు చెబుతారు. కాని వీరి పటం శైలి మరికొంత భిన్నంగా ఉంటుంది. మందెచ్చు వాళ్ళు అనే
169