కులమతాలకు అతీతంగా శ్రీ మహావిష్ణువు జగన్నాథుని రూపంలో మనలను తరింపచేయటానికి అవతరించాడు అని చెప్తుంది ఈ తిరునామం. జనులారా అందరూ రండి! ఈ సర్వ జగాలను పాలించే ఆ శ్రీమహావిష్ణువు ఎలా అవతరించాడో చూద్దాం అని మొదలవుంది. ఈ తిరునామంలో కమలం వంటి కన్నులు కలవాడు, వాసవితో స్నేహంగా మెలిగేవాడు, సముద్రం వంటి గంభీరమైన కన్నులు గలవాడు, గజేంద్రునికి మోక్షము చేకూర్చినవాడు; కోరితే బంగారం, డబ్బులు ఇచ్చే ఆపారమైన చేతులు కలవాడు, శరణు అని వేడితే కరుణతో ఆదుకొనేవాడు అని తెలియజేస్తుంది. అలాగే ఈ తిరునామంలో లత వంటి శరీరంగల ఆడవాళ్ళలారా అందరూ రండి! ఆ భగవంతుని చరితము విందాము వేగంగా రండి! కలియుగంలో ఆషాడ శుద్ధమి నాడు సంతోషంతో ఇంద్రుడు జగన్నాథుని చూడటానికి వస్తాడు. ఈ సందర్భంలో దేవతలందరూ వర్షము కురిసినట్లుగా వస్తారు. నారదముని మరియు ఇతర మునులు కూడా విచ్చేస్తారు. గరుడుడు, గంధర్వులు అందరూ కలిసి రథములో వస్తారట. బంగారు రథము, వేగవంతమైన అశ్వాలు, హంసతూలికా పాన్పులతో కూడిన రథము, ఆ రథానికి ముత్యాల తోరణముతో సుభద్ర బలరాముల మధ్యనున్న శ్రీకృష్ణుడు ముందుగా ఆ మూర్తులతో కిందికి దిగుతాడు. ఈ విధంగా విష్ణువు అవతారమెత్తడానికి ముందుగా కిందికి దిగుతాడు అని వర్ణించినట్లుగా ఉంటుంది ఈ తిరునామం. ఇంకొక చరణంలో ఒకరోజు నారాయణుడు గుడి వదలి బయటికి వెళ్తాడట, అడవిలో ఒక నెలరోజుల పాటు అక్కడే బస చేస్తాడట. ఇది తెలుసుకొని అతనిని పూజించే దాసులందరూ పూజలు చేయడానికి వస్తారట. వచ్చే పూజారులు వచ్చే విధానం ఎలా ఉంటుందంటే... వారు అనేకరకాలైన పిండివంటలతో అంటే.. గారెలు, బూరెలు, అప్పడాలు, తేనె, పులిహోర, చక్రపొంగలి, పాలతో వండిన పరమాన్నము తీసుకొని, గుడిలో ఘనఘనమని గంటలు మ్రోగినట్లు అడవిలో నారాయణుడిని పూజింతురట. ఇక అక్కడ, ఆ గుడి వెలసిన ఆ చుట్టూ ఎన్నో బైరాగి మఠాలు స్థాపించబడ్డాయట. అలా మఠాలు స్థాపించిన వారిలో ఎక్కువమంది యోగీశ్వరులేనట. మార్కేండేయుని పెరుగు గుండమనే గుడి శ్రీకృష్ణుని వరా వృక్షము అక్కడే ఉందట. ఒక్క మంటకి వేడివేడి అన్నము తయారగునట. షేకు సయ్యదు అంటే... హిందూ, ముస్లింలు ఏకముగా ఒకేచోట అన్నమును తిందురట అని ఈ తిరునామం అర్థం. అంటే కుల, మత భేదం లేక సర్వమతాలు ఒక్కటే అని చాటుతూ అని జ్ఞానబోధను తెలియచెప్పే తిరునామం ఇది. 125
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/144
స్వరూపం