పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యమంత్రి రాజీనామా వార్త అందరికీ తెలిసిపోయింది. అందరూ నా వద్దకు వచ్చి వివరాలు అడగటం ప్రారంభించారు. పూర్తివివరాలు నేను తెలుసుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి చెన్నారెడ్డి రాజీనామా చేశారని మాత్రమే తెలిసిందని వారికి వివరించాను.

ఎయిర్ పోర్టులో రాష్ట్ర రాజకీయాల మీద చర్చ మొదలైంది. ఈ హఠాత్ పరిణామం అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది. డా॥ చెన్నారెడ్డి పరిపాలనలో తప్పొప్పులపై మాట్లాడసాగారు అందరూ.

వీడ్కోలు

మారిషస్ మంత్రి శ్రీ ఉచ్చన్న, ఆంద్ర మహాసభ అధ్యక్షులు శ్రీ సూరయ్య ఎందరో మారిషస్ ఆంధ్రులు ఎయిర్‌పోర్టుకు వచ్చి మాకు బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పారు. విమానం నుంచి మారిషస్ భూభాగాన్ని తిలకిస్తున్న నాకు కొసరాజు గీతం మనసులో మెదిలింది.

తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు

తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు

మరచిపోని అతని కట్టు
మారిపోని అతని బొట్టు

తలుచుకున్న రోమరోమం పులకరిస్తుందీ

అభిమానం పొంగి పొరలి ఉరకలేస్తుందీ!

ఎంత నిజం!... పలుకు నేర్పిన గడ్డనీ ... పుట్టుకకు కారణం అయిన తల్లినీ ఎవరు మాత్రం మరచిపోగలరు? మారిషస్‌కు దూరం అవుతున్నాం. మారిషస్ ఆంధ్రులకు దూరం అవుతున్నాం... విమానం గాలిలోకి ఎగరగానే ... అయితే ఆ కొద్ది రోజుల సహచర్యం.. . పంచుకున్న పలుకులూ... అభిమానాలూ ...ఆత్మీయతలూ హృదయాలను విడిపోనీయనంత గట్టిగా ... ఘనంగా ముడి వేసేశాయి. స్నేహకపోతంలా....! ! ! అవును... తేనేలాంటి తెలుగుతనం ఆంధ్రులన్న వాళ్ళు ఎక్కడున్నా కలిపే ఉంచుతుంది.

మనోపలకం మీద చెరగని రూపాలతో.. . చెదరని బందాలలో ---

విమానం అలా అలా మబ్బు తునకల్ని చీల్చుకుంటూ .. మారిషస్‌కి వీడ్కోలు చెబుతూ భారతదేశంవైపు పయనిస్తోంది.

స్నేహకపోతంలా....! ! !