పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ విష్ణు క్రిస్ నాయ్డు తన అడ్రసు నాకిచ్చి మాకు పూజా పునస్కారాలు జరిపేందుకు పురోహితులు కావాలి. ఆంధ్రదేశం నుండి ఎవరైనా వస్తే వారికి జీతం - వసతి సదుపాయం ఇస్తామని, ఎవరినైనా పంపటానికి ప్రయత్నించమని మరీ మరీ చెప్పారు. దక్షిణాఫ్రికా మహిళా ప్రతినిధి శ్రీమతి మహలచి రాపిటి మాతో ఎంతో కలివిడిగా ఉండేది. ఆమె మెడికల్ లైబ్రేరియన్‌గా దక్షిణాఫ్రికాలో పనిచేస్తోంది. మా తాతగారు అనకాపల్లి నుండి వలస వచ్చారని కూరలు, పండ్ల వ్యాపారం చేసేవారని చెప్పింది. ఆమె చూపించిన ఆప్యాయత, ఆత్మీయత మరువలేం.

భారమైన హృదయాలతో మారిషస్, దక్షిణాఫ్రికా ఆంధ్ర సోదరుల వద్ద శలవు తీసుకుని తిరుగు ప్రయాణానికై గోల్డ్ క్రీస్ట్ హెూటల్ విడిచి బయలుదేరాం.

మార్గమధ్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య ఇంటికి వెళ్ళాము. శ్రీ సూరయ్య సతీమణి శ్రీమతి నిష్ట ,కుమార్తెలు ప్రియ, వందన ప్రేమ పూర్వక ఆహ్వానం పలికారు. మహాసభలను దిగ్విజయంగా నిర్వహించినందుకు శ్రీ సూరయ్యకు అభినందనలు తెలియచేసి కృతజ్ఞతలు చెప్పాము.

మహాసభలు మారిషస్ ఆంద్రులలో ఒక కదలిక, చైతన్యం తీసుకువచ్చాయని, మహాసభ తీర్మానాలు అమలు జరపక పోతే పడిన శ్రమంతా వృథా అవుతుందని శ్రీ సూరయ్య చెప్పారు. ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ప్రపంచ సభలు జరపాలని, సంవత్సరానికి ఒకసారి ప్రతినిధులు కలుసుకోవాలని సూచించారు.

శ్రీమతి నిష్ట మారిషస్ సావెనీర్‌లను మాకు బహూకరించింది. వారి వద్ద శెలవు తీసుకుని బయలు దేరాం. శ్రీ త్యాగరాజ్ దారిలో నేషనల్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ రాఘవుడు ఇంటికి తీసుకు వెళ్ళారు. తెలుగు వారిలో సంపన్నుడైన శ్రీ రాఘవుడు అతి నిరాడంబరుడు. ఆయన సతీమణి తెల్లగా మేలిమి ఛాయతో ఉండటం వలన పాశ్చాత్య వనిత అని భ్రమపడిన మాకు శ్రీ రాఘవుడు ఆమె ఆంధ్ర వనిత అని చెప్పి ఆశ్చర్యచకితులను చేశారు. శ్రీ రాఘవుడు ఇంటినుంచి హైద్రాబాద్‌కు ఫోన్ చేసి మేము బయలుదేరి వస్తున్న సంగతి చెబుదామని అనుకున్నాను. ముఖ్యమంత్రి డా చెన్నారెడ్డి రాజీనామా చేసినట్టు పత్రికలో వచ్చిందని చెప్పారు. నా ప్రక్కనున్న వేణుమాధవ్ ఈ విషయం విన్నారు.

మేము త్యాగరాజ్ ఇంటివద్ద భోజనం చేసి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాము. అప్పటికి ప్రతినిధులు, మారిషస్ ఆంధ్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు.