పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఛానల్లో వారానికి మూడు రోజులు అరగంట చొప్పున తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. రెండవ ఛానల్లో ప్రతి రోజు అరగంట తెలుగు కార్యక్రమాలు ఉంటాయి.

నవంబరు 1న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్ ఆంధ్రులు పెద్ద ఎత్తున జరుపుతారు. మారిషస్ తెలుగువారిలో ఎవరిని కదిపినా అమరజీవిపాట్టి శ్రీరాములుగారి గురించి అనర్గళంగా చెబుతారు. నిజానికి మనకి సహితం తెలియని పొట్టి శ్రీరాములుగారి చరిత్ర వారు చెబుతూంటే విని విస్తు పోయాను. ప్రాణత్యాగంచేసి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టిన ఆ మహనీయుని పట్ల వారికి అనంతమైన కృతజ్ఞతా భావం హ్పదయంలో నిండిఉంది. దీనిని బట్టి స్వరాష్ట్రంపట్ల వారికి ఉన్న అభిమానం ఎంతటిదో గమనించవచ్చు.

దక్షిణాఫ్రికా ప్రతినిధుల ఆదర్శం

డిసెంబర్ 13న మా తిరుగు ప్రయాణం. వారం రోజులుగా మారిషస్, దక్షిణాఫ్రికా ఆంధ్రుల అపూర్వ ప్రేమాభిమానాలకు నోచుకున్న మాకు వారిని వదలి వెళ్ళి పోతున్న భావన బాధించింది. ఆ రోజు ఉదయం గోల్డ్ క్రిస్ట్ హెూటల్లో దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభవారు మన ప్రతినిధుల గౌరవార్ధం బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

దక్షిణాఫ్రికాలో రాజకీయ పరిస్థితులు చక్కబడి మంచి రోజులు వస్తే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మనందరం కలుసుకుందామని వీడ్కోలు సభలో ప్రసంగించినవారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా ఆంధ్రుల ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీమతి జమున, డా అక్కినేని ప్రసంగించారు. చివరగా డా సి. నారాయణరెడ్డి తాత్విక ధోరణిలో తాను రచించిన తెలుగు గజల్ వినిపించారు.

మరణం ననువరించివస్తే ఏమంటూను నేనే మంటానూ

పాలుపట్టి, జోలపాడి పడుకోమంటాను -

లంచం ననుభజించివస్తే ఏమంటూను నేనే మంటానూ

తిరుమలగిరి హుండీలో జొరబడమంటాను

కామం ననుకలవరపెడితే ఏమంటానూ నేనే మంటానూ

అలిగివున్న పడుచు జంటతో కలబడమంటాను.

అని కమ్మగా సి.నా.రె. గొంతు పాడుతూంటే అందరి చేతులు వరుస కలిసి తాళం వేస్తూండగా సరదాగా వీడ్కోలు సభ ముగిసింది.