పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పలికేటపుడు, బీహారీ సోదరులు, "ఏమండో మీరు, ఒండో మొండో అని పలుకుతున్నారే, మమ్ము తిడుతున్నారేమో" అని పరిహాసం చేసేవాళ్ళు బహుశః ఇదే కారణంగా లేదా మన వాళ్ళకి సిగ్గు తనం వల్లనో మన తెలుగు భాష బాగా దెబ్బతింది. ఈ దశలో మన తెలుగు భాష పట్ల ప్రోత్సాహం ఇచ్చేది ఎవరు? సహాయకులు ఎవరూ లేరు. సోంతంగా ప్రయత్నం చేయాలి.

మా తాత ముత్తాతల స్వర్ణభూమియైన ఆంధ్రప్రదేశం నుంచి మన పూర్వీకులు మమ్ము మరిచిపోయారు. అప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయిన బిడ్డలవలే మేమున్నాం.

సౌభాగ్య వశాత్తున కొందరు మహానుభావులు, ఆంధ్రప్రదేశం నుంచీ, మద్రాసు నుంచీ తెలుగు పుస్తకాలు తెప్పించ నారంభించారు. అది కూడా ఆరు నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఆ పుస్తకాలు లభించేవి గాని ఈ పుస్తకాలు తెప్పించేవారి సంఖ్య చాలా తక్కువ. 1940-1945 మధ్య తెలుగు భాషా ప్రచారకులలో స్వర్గీయ పండిత గున్నయ్య ఒత్తుగారు ముఖ్యులు. 1947 సం.లో ఈయన తెలుగు భాష బాగా నేర్చుకొనే ఉద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశానికి తరలి వెళ్ళారు. అక్కడ విశాఖపట్నంలో ఉండి సంస్కృతం, తెలుగు, హిందీ నేర్చుకుని 14 సంవత్సరాల తర్వాత "విద్యాభూషణ" సంపాదించుకుని మారిషస్ దేశానికి మరలి వచ్చారు. స్వర్గీయ పండిత రామమూర్తి అప్పన్నగారు వీలయినంత తెలుగు భాష ప్రచారం చేశారు. అంటే అప్పుడు మా మారిషస్ దేశంలో తెలుగు భాష ప్రచారకులు లేనట్టే. స్పష్టంగావించటానికి నా సొంత కధ ఇక్కడ చెప్పాలి. శ్రీ గున్నయ్య గురువుగారి దగ్గర నాలుగు నెలలు మాత్రం తెలుగు భాష నేర్చుకున్నాను. ఆయన ఆంధ్రప్రదేశానికి వెళ్ళిన తర్వాత నాకు తెలుగు భాష చెప్పేవారు ఎవరూ లేరు. నిరుత్సాహపడి నాలుగు సంవత్సరాలు తెలుగు పుస్తకాలు ముట్టలేదు. అప్పుడు ఒక బీహారీ భాష మాట్లాడే మిత్రుడితో సహా కొంత హిందీ భాష నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏదో హిందీ - తెలుగు translation పుస్తకం నాకు అందింది. దాని మూలంగా కొంత తెలుగు భాష నేర్చుకోగలిగాను. దీనితోనే నేను సంతోషించాను. కాని గురువు లేని చదువు ఎలా ఉంటుందో ఇది ఆలోచింపదగిన విషయం. 1947 సం, న Mauritius Andhra Maha sabha వారు ఆంధ్రప్రదేశం నుంచి తెలుగు పుస్తకాలు తెప్పించారు. అన్ని ప్రాంతాల్లో వీలయినంతా సాయంత్రపు తెలుగు బడులు తెరిచారు. ఆ బడుల్లో తెలుగు భాష బోధన ఆరంభించారు. అంత చక్కగా భాషా జ్ఞానం లేనప్పటికి వీలయినంత ప్రయత్నం చేశారు మన ఉపాధ్యాయులు.