పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 1982లో జరిగిన ఎన్నికల తరువాత MMMI P.S.M పార్టీలలో చీలికలు వచ్చాయి. శ్రీ జగన్నాధ్ మూవ్ మెంట్ మిలిటెంట్ పార్టీ స్థాపించి 1983, 1987లలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు.

సౌమ్యుడు, నిరాడంబరుడు అయిన శ్రీ జగన్నాథ్ విదేశీ ప్రతినిధులతో ఎంతో సౌహార్దంగా వ్యవహరించారు. ప్రత్యేకించి మా నాన్నగారిని ఆయనెంతో గౌరవభావంతో చూశారు. MAMS విందులో ప్రముఖులకు మెమెంటోలు బహుకరించారు. అందరూ వెళ్ళి ఆయన వద్దనుంచి మెమెంటోలు స్వీకరించారు. మా నాన్నగారు వెళ్ళి ఆయనవద్ద నుంచి మెమెంటో తీసుకునేందుకు సిద్ధపడగా ఆయన వారించి తానే మా నాన్నగారి వద్దకు వచ్చి మెమెంటో అందచేశారు. అది వారి సౌజన్యానికి నిదర్శనం.

డిశెంబర్ 12వ తేది మహాసభల ముగింపురోజు. ఆరోజు ఉదయం పదిగంటలకు ఆచార్య గిరిప్రకాష్ అధ్యక్షతన 'విదేశాలలో తెలుగువారు' సదస్సు జరిగింది. దక్షిణాఫ్రికాలో ఆంధ్రుల చరిత్ర గురించి శ్రీ బి.ఎ.నాయుడు (దక్షిణాఫ్రికా), మారిషస్‌లో వేమన పద్యాల గురించి శ్రీ ఆర్. అప్పడు (మారిషస్), మారిషస్‌లో తెలుగు బోధన ప్రభావం గురించి శ్రీ సోమన్న సోమయ్య ప్రసంగించారు.

మారిషస్‌లో తెలుగుబోధన

మారిషన్ లో తెలుగు బోధన గురించి రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీ సోమన్న సోమయ్య చేసిన ఉపన్యాసం గమనించతగ్గది. మారిషస్‌లో శ్రమజీవులుగా అడుగుపెట్టిన తెలుగువారు తమ భాషను నిలబెట్టుకునేందుకు ఏవిధంగా ప్రయత్నించారో వివరణాత్మకంగా శ్రీ సోమయ్య చెప్పారు. తెలుగుబోధన సమస్యల గురించి మనం కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రసంగంలోని కొన్ని ముఖ్యభాగాలు-

పూర్వ కాలపు బోధనకీ ఆధునిక కాలపు బోధనకీ చాలా తేడా ఉంది. ఉదాహరణంగా సుమారు అరవై సంవత్సరాల కింద సాయంత్రపు బడుల్లో ఇప్పుడు మాదిరిగా, బడులు దేవాలయాలు విడిగా లేవు. ఆ సమయాన దేవాలయం ఒక మూల బడి నడిపేవారు. బడులు దర్బా గడ్డితోనైనా, చెరకు ఆకులతోనైనా కప్పి యుండేవి. మా బడి విషయం అంటే నేలపై ఇసకలు వేసి, వాటిపె చేతి వేలితో రాసేవారు. అవి ఎలా మొదలు పెట్టేవారంటే :