పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫెడరేషన్‌కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్నచిన్న విభేదాలు ఉన్నా వాటిని విస్మరించి భాషాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలని సలహా ఇచ్చాము.

మన ఆంధ్రుల సౌంస్కృతిక బృందంవారి ప్రదర్శనలు మారిషస్‌లోని సుదూర గ్రామాలైన మహేబర్గ్, సాయిలకలలో ఏర్పాలు చేశారు.

సూర్యాస్తమయం వేళ సముద్రతీరం వెంట కారులో పయనిస్తూ ప్రకృతి సౌందర్యవీక్షణలో ఆకాశంలోని సప్తవర్ణాలని తిలకిస్తూ మలయపవనాల్ని ఆస్వాదించటం ఒకమధురానుభూతి. దారిలో ఒకచోట కారాపి బీచ్‌లో కాసేపు ఆగాం. మారిషస్‌లోని బీచ్‌ల నిర్వహణ చాలా చక్కగా ఉంటుంది. సెలవు రోజుల్లో బీచ్ కిటకిట లాడిపోతూంటుంది.

ఆ రాత్రి 7.30 గంటలకు సాయిలకలోని వివేకానంద సెకండరీ స్కూలులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యాం. మారిషస్ పార్లమెంటు సభ్యులు, తెలుగుబిడ్డ శ్రీ కృష్ణబాలిగాడు స్వాగతం చెప్పారు. ప్రభుత్వపక్షానికి వ్యతిరేకి అయినప్పటికీ శ్రీకృష్ణబాలిగాడు తెలుగు మహాసభల నిర్వహణకు పూర్తి మద్దతునిచ్చి సహకరించటం విశేషం. బాలిగాడుపట్ల మన తెలుగువారు చాలా ఆదరభావం చూపుతారు.

రాత్రి 9 గంటలకు వాకోస్‌లో తెలుగు మహాసభల ప్రతినిధివర్గం గౌరవార్ధం మారిషస్ రక్షకదళం SMF వారు విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అనిరుద్ జగన్నాధ్ విందుకు విచ్చేసి విదేశీప్రముఖులైన శ్రీ మండలి వెంకట కృష్ణారావు శ్రీ రాజారెడ్డి, శ్రీమతి రాధారెడ్డి, శ్రీ నాయుడు (దక్షిణాఫ్రికా)లకు SMF పక్షాన మెమెంటోలను ప్రదానం చేసి సత్కరించారు. పలువురు మారిషస్ మంత్రులు, అధికారులు ఈ విందుకు హాజరయ్యారు.

పరిపాలనాదక్షుడుగా పేరుపొందిన ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్ 1930 మార్చి 29న జన్మించారు. మారిషస్, ఇంగ్లాండులో విద్యనభ్యసించి 1956లో న్యాయవాదవ్పత్తి చేపట్టారు. 1960లో లెజిస్లేబర్ కౌన్సిల్ సభ్యునిగా, వాకోస్‌పోయి నిక్స్ పట్టణ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1965లో మారిషస్ అభివృద్ధిశాఖామంత్రిగా 1967లో కార్మికమంత్రిగా పనిచేశారు. తిరిగి న్యాయవాదవృత్తి చేపట్టి 1969లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. 1971లో "మూవ్‌మెంట్ మిలిటెంట్ మారిషస్ పార్టీలో చేరి 1976 ఎన్నికల్లో పార్లమెంటుకి ఎన్నికై ప్రతిపక్షనాయకునిగా వ్యవహరించారు.