పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన 1940వ సంవత్సరం నుంచి ఒక మతప్రచారకునివలె ఇంటింటికి వెళ్ళి యువకులను ఉత్సాహపరచి భాష భోదించారు. ఆయన 1960 చివరి వరకు ఈ కార్యక్రమం చేస్తూ పరమపదించారు. తరువాత పండిత ఒట్టు ఆంధ్రదేశంలో భాషాభ్యాసనం చేసి వచ్చి భాషాసేవకు అంకితం అయ్యారు. అలా ఆనాడు మా పూర్వీకులు తెలుగుభాష, సంస్కృతికి వేసిన పునాదులు ఈనాటి వరకు సుస్థిరంగా నిలిచిపోయాయి.

1954 సంవత్సరంలో రేడియో స్టేషన్ తొలిసారి తెలుగువాళృకోసం తెలుగుభాషలో ప్రసారం ఆరంభించింది. ఆదివారాలలో 15 నిముషాలే అయినా అది తెలుగువాళ్ళను చాలా ఆనందపరిచింది.

1958 సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుపిల్లలకు తెలుగు భాషా బోధన ప్రభుత్వం ప్రారంభించింది. 1972 సంవత్సరంలో 52 సాయంత్రపు పాఠశాలల్లో తెలుగు బోధన జరుగుతూండేది.

బళ్ళో కావలసిన పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రభారతి వాచకాలు తెప్పించి ఇక్కడ మాపిల్లల స్థాయికి తగ్గట్టు ఉపయోగించటం జరిగింది. తత్ఫలితంగా ఇక్కడ యువకులైన తెలుగువాళ్ళు లిఖితభాషగా ఉన్న గ్రాంధికభాషనే భాషిత భాషగా సంభాషించేవారు. అప్పడు దేశంలో రెండురకాల తెలుగుభాషను మాట్లాడేవారు ఉన్నారు. ఒకరు మాండలీక సంబంధమైన తెలుగుభాషను మాట్లాడే ముసలివారు. మరొకరు గ్రాంధికభాషను నేర్చుకుని మాట్లాడే తెలుగు యువకులు. అది ఒక రకమైన గందరగోళానికి కారణమయ్యింది.

వ్యవహారిక భాషోద్యమానికి కన్యాశుల్కంతో గట్టిపునాది పడింది. ఆంధ్రాలోనే తెలుగుభాషలో గొప్ప మార్పు సంభవించటం వలన మారిషస్ దీని నుంచి తప్పించుకోలేకపోయింది.

1975వ సంవత్సరంలో I.T.E.C. EXPERTగా వచ్చిన వేటూరి ఆనందమూర్తిగారు ఇక్కడ భాషా బోధనలో మార్పు తీసుకురావటం తప్పదని భావించి 1975 నుంచి అన్ని బళ్ళల్లో వ్యావహారిక భాషాబోధన ఉండాలని నిర్ణయం తీసుకుని తెలుగు వారికి సలహా ఇచ్చారు. అప్పట్నుంచి మా దేశంలో పిల్లలకు ప్రచురించే పుస్తకాలు గ్రాంధికభాషలో కాకుండా వ్యావహారికభాషలో ఉండేలా ఆయన వ్రాసి ఇచ్చారు. ఈ రోజు కళాశాలల్లో కూడా అన్ని పరీక్షలకు వ్యావహారిక భాషకు ప్రాధాన్యత ఇస్తున్నాం.