పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాష, తెలుగు సంస్కృతి తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఇక్కడకు వచ్చిన ఆంధ్రులు నూరుశాతం కష్టజీవులే. వాళ్ళకి తెలుగు భాషలో పాండిత్యం లేదు, పండితులు కారు, వాళ్ళు పురోహితులు కారు, పూజాకార్యక్రమ విధులు తెలియవు. వట్టి పామరులు, వాళ్ళు సహించిన బాధలు, పడిన కష్టాలు ఎవరితో మొరపెట్టాలని ఎంతతోచినా ఒక్క దేవుడి శరణం తప్ప ఎవ్వరూ కనపడలేదు.

రాత్రిపూట దేముడి పాదాలకు మొక్కి సింహాద్రి అప్పన్న పూజలతో, రామభజనలతో పాడటం జరుగుతుంది. భద్రాచలం రామదాసు కీర్తనలు, నృశింహస్వామి శతకం నుంచి పద్యాలు ఈ నాటికీ మారిషస్‌లో పాడుతూనే ఉన్నారు.

ఉగాది పండుగ గురించి మారిషస్ తెలుగు వాళ్ళకి 1950కి ముందు తెలీదని తోస్తోంది. తెలుగువాళ్ళ కార్యాలయాల్లో తెలుగుభాష ప్రతిబింబించేది. వేరేభాష తెలియని కారణంగా వాళ్ళు తమ పాస్ పోర్టులను కూడా అదే భాషలో వ్రాసి సంతకం చేశారు. ఇది 14-10-1847 నాటి ఒక పాస్ పోర్ట్‌లో కనిపించింది.

ప్రతీ ఏడు న్యూ ఇయిర్ సందర్భంగా నాటకాలు ప్రదర్శించేవారు. అవి రామనాటకం, వీరభద్రనాటకం. ఈ పౌరాణిక నాటక ప్రభావం వలనే తమకు పూజ చేయటం కోసం గుడి కావాలని, తమ నివాసం ఎదుట ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకుని ఒక గుడిగా మార్చుకున్నారు. 'రామలీలలు' కూడా ప్రదర్శన రూపంలో తెలుగు వాళ్ళు కొన్నిచోట్ల ప్రదర్శించారు.

1927 లో మారిషస్ తెలుగు అసోసియేషన్ అని ఒక సభ స్థాపించారు. ఇంతకు ముందు వ్యక్తిగతంగా భాషా ప్రచారం చేసినవాళ్ళు తెలుగు సభలో చేరి ఆ సభకు ఈ బాధ్యత ఇచ్చారు. చివరకు 1942లో మారిషస్ ఆంధ్రమహాసభ స్థాపించి దేశం నలుదిక్కులలో (MAMS) శాఖలు స్థాపించి సాయంత్రం తెలుగుభాష బోధన ఆరంభించారు. MAMS స్థాపనలో తెలుగువాళ్ళు ఉన్న ప్రదేశాలలో తెలుగు పాఠశాలలు, తెలుగు మందిరాలు కట్టుకునేందుకు తెలుగువాళ్ళు పూనుకున్నారు. 1972 నాటికి MAMS శాఖలు దేశంలో 59 ఉండేవి. 1990 నాటికి ఈ శాఖలు 75 కంటే ఎక్కువ ఉన్నాయి.

దేశంలో కొత్త కొత్త పరిశ్రమల స్థాపనలో అతివేగంగా వస్తున్న అభివృద్ధి వలన తెలుగు భాష అభ్యసనం కొంత తగ్గింది కాని - అభిమానం తెలుగువాళ్ళు పోగొట్టుకోలేదు. దానికి తోడ్పడి ప్రాణం ఇచ్చిన మహనీయుడు పండిత రామ్మూర్తి.