పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేతులుజోడించి మందహాసంతో 'నమస్కారం' అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.

దక్షిణాఫ్రికా సమాజాభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర

దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ వి.కె.నాయ్డు దక్షిణాఫ్రికా సమాజాభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర గురించి తొలిసదస్సులో ప్రసంగించారు. ఆ ప్రసంగం లో తెలిపిన విశేషాలివి -

నేటాలులో 1824లో స్థావరమేర్పరుచుకున్న బ్రిటిష్ వారు అక్కడ తేయాకు, ప్రత్తి, చెరకు తోటలను పెంచటం ప్రారంభించారు. 1855 సంవత్సరానికల్లా చెరకు వ్యవసాయం చాలా సులభం అని కనిపెట్టారు. కాని వారికెదురయిన సమస్య నమ్మకస్తులయిన వ్యవసాయ కార్మికులు దొరకడం.

1855 వ సంవత్సరంలో మారిషస్‌లో చెరకు వ్యవసాయదారులుగా ఉన్న మిల్లన్ సోదరులు నేటాలు వెళ్ళారు. వారితోబాటు బాబునాయుడు అనే ఆంధ్రుణ్ణి తీసుకుని వెళ్ళారు. వారే మొదట ఇండియా నుండి కట్టుబడి కూలీలను తేవాలనే ప్రతిపాదనకు నాంది పలికారు. సుదీర్ఘ చర్చల అనంతరం భారత ప్రభుత్వం కట్టుబడి కూలీలను దక్షిణాఫ్రికాలో ప్రవేశానికి అనుమతి నిచ్చింది.

1863 సంవత్సరానికల్లా 4000 మంది మద్రాసు నుండి, 1200 మంది కలకత్తా నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వలస వచ్చిన వారిలో 40% ఆంధ్రులు, ప్రధమంలో చెరకు పరిశ్రమ ఆంధ్రులపై ఎక్కువ ఆధారపడి ఉండేది.

తెలుగు వలసదారులలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, పోర్టర్లు గుమస్తాలు, పశుపాలకులు, నావికులు, పోలీసులు, చాకలి పనివారు, రొట్టెల తయారీ దారులు ఉండేవారు. కాని ఆంధ్రులలో ఒక గుణ విశేషం ఉంది. వారు నిస్తేజులు కారు. కట్టుబడి కూలీల నుండి విముక్తులు కాగానే వారి తెలివితేటలు, చొరవతో వ్యవసాయదారులు కాగలిగారు, ఆంధ్రులలో బడా అరటిపండ్ల ఎగుమతిదారులు కూడా ఉన్నారు. పి.యమ్.నాయ్డు, రెడ్డి నాయ్డు బ్రదర్స్ చక్కెర మిల్లులకు చెరకు సరఫరా కోటా పర్మిట్లు ఉన్న చెరకు వ్యవసాయదారులు భాగ్యవంతులేకాక తెల్లవారితో సరితూగగల నైపుణ్యంతో వీరు వ్యవసాయక్షేత్ర నిర్వహణ జరిపారు.

1930 శకంలో సి.రెడ్డి, చిననాయుడు చెరకుతో పాటు టమోటాలు, చిక్కుళ్ళు, శనగలు సేధ్యం చేసేవారు.