పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 వీటిలో కోరంగి పికేట్ తెలుగు వారిది. దాని యజమాని పేరు పానముండ వెంకటరెడ్డి. 231 టన్నుల బరువు కల ఆ ఓడ నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ. కాకినాడ దగ్గర కోరంగి రేవు నుండి బయలుదేరి ఆ సంవత్సరం రెండు సార్లు తిరిగి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.

1842 జనవరి 15న ఆర్డర్ ఇన్ కౌన్సిల్ జారీ చేసిన ఇండియన్ చార్ట్ లేబర్ సిస్టమ్ (Indian Chart Labour System) అనుసరించి మద్రాసు ప్రెసిడెన్సీనుంచి 3 లేక 5 సంవత్సరాల కాంట్రాక్టు పద్ధతిలో తెలుగు వారు అధిక సంఖ్యలో మారిషస్‌కు తరలి వచ్చారు. అలా దాదాపు 20 వేల మంది తెలుగువారు మారిషస్‌కు వచ్చి స్థిరపడ్డారు.

మారిషస్‌కు వచ్చేటప్పుడు వారు ఎంతో ఆశాపూరితంగా వచ్చేవారు. కానీ పోర్టులూయిస్ చేరుకుని వలస కేంద్రం యొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడే వారు ఏదో విషవలయంలో చిక్కుకున్నట్టు బాధపడేవారు. మానసికంగానూ, శారీరకంగానూ వారు బాధలు పడటానికి మారిషస్ వచ్చినట్టు తెలుసుకునేవారు. ఈ కాందిశీకులు బలోపేతమైన ఇనుప తీగల నడుమ రెండు రోజుల పాటు గడపవలసి వచ్చేది. అటుపిమ్మట వారిని పంచదార ఎస్టేటుకి పంపేవారు. వలస మెట్లు ఆనాటి ఓడల ఫోటోలు ప్రదర్శనలో పెట్టారు. సముద్రంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని వారు ఓడలో ప్రయాణం చేసేవారు. మారిషస్‌లో కాలుపెట్టిన తరువాతే వారు బ్రతుకు జీవుడా అనుకునేవారు.

మార్గమధ్యంలో సముద్రయానంలోనే అనారోగ్యానికి గురై, ప్రకృతి వైపరీత్యాలకుగురై ఎందరో అసువులు బాసేవారు. 1859 సంవత్సరంలో 485 మంది ఉన్న షాజహాన్ అనే ఓడ నిప్పంటుకుని అందులోని ప్రయాణీకులందరూ సజీవదహనమై పోయారట. అలాంటి విషాద సంఘటనలకు దారిలో ఎందరో బిలి అయ్యారు.

1835 నుంచి తెలుగువారి వలస ప్రారంభం అయినా 1843 వరకు వచ్చిన వారిలో స్త్రీలు లేకపోవటం విశేషం. 1843 లో 88 మంది, 1844 లో 20 మంది మహిళలు వచ్చారు. తిరిగి 1851 లో 66 మంది స్త్రీలు వచ్చారు. తరువాత సంవత్సరాలలో పురుషులతో బాటు స్త్రీలు కూడా రావటం ప్రారంభించారు.

150 సంవత్సరాల క్రితం మన తెలుగు మహిళలు ధరించిన రకరకాల వెండి, బంగారు ఆభరణాలు ప్రదర్శనలో తిలకించాము. అప్పటి మన ఆంధ్రుల వేషధారణ,