పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 1962 నుంచి ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోందని తెలియచేశారు.

శ్రీ పరుశురామన్ తమ ప్రసంగం ముగింపులో తెలుగులో ప్రసంగిస్తూ- "ఎంతో త్యాగం చేసి మన పెద్దలు తెలుగు భాషని కాపాడినారు, తెలుగు భాష తీయనిది. శ్రీ కృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు.

పాశ్చాత్యులు "ఇటలీయన్ ఆఫ్ ది ఈస్ట్" అన్నారు. ఇంతగొప్ప భాష మారిషస్లో ఉన్నందుకు సంతోషిస్తున్నాం" అంటూ కరతాళధ్వనుల మధ్య తమ ప్రసంగం ముగించారు.

తెలుగు బిడ్డడు, మారిషస్ ప్రభుత్వ ఇంధన జల వనరుల, తపాలాశాభా మాత్యులు శ్రీ మహేన్ ఉచ్చన్న తెలుగులో మాట్లాడారు. ఆయన తమ ప్రసంగంలో—"ఈనాడు ఈ సభలు మనదేశంలో జరుగుతున్నాయంటే తెలుగు వాళ్ళం చాలా సంతోషిస్తున్నాం’ అని ఆనందం వ్యక్తం చేశారు.

మారిషస్ తెలుగు వారి వలస - ప్రదర్శన

మారిషన్ లో తెలుగువారి వలస (Telugu Settlement in Mauritius) పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు ప్రారంభించారు.

మారిషస్‌కు తెలుగు వారు ఎప్పుడెప్పుడు వలస వచ్చిన వివరాలు తెలిపే చార్టులు, రికార్డులు, ఆనాడు వారు తమతో తీసుకుని వెళ్ళిన వస్తువులు, ఆభరణాలు, వంటపాత్రలు, రోళ్ళు, రోకళ్ళు, పుస్తకాలు సేకరించి ప్రదర్శనలో ఉంచారు.

ప్రస్తుతం మన దగ్గరున్న సాక్ష్యాధారాలను బట్టి ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం 1836 లో గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు కష్టజీవులుగా ఆ ద్వీపంలో కాలుపెట్టారు.

'కోరంగి' రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు కోరంగివాళ్ళు అనేపేరు వారికి వచ్చింది. (కోరంగిరేవు కాకినాడ సమీపాన ఉంది). వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పేరు పెట్టారు. 1843 సంవత్సరంలో దాదాపు 35 ఓడల్లో భారతీయులు మారిషస్‌కు వలస వచ్చారు. వారిని తీసుకుని వచ్చిన ఓడల పేర్లు సిటీ ఆఫ్ లండన్, కింగ్ స్టన్, ఫ్లవర్ ఆఫ్ ఉగీర్, సుల్తాన్, సిరంగపట్నం, బాబా బ్రాహ్మిన్, కోరంగి పికేట్ మొదలైనవి.