పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా చెంతనే కూర్చున్నారు. ఆయన నాతో మాట కలిపి 1977లో దివిసీమలో సంభవించిన తుఫాను-ఉప్పెనల గురించి ఆ సమయంలో మా నాన్నగారు చేసిన సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ విషయాలన్నీ ఆయనకెలా తెలుసా అని ఆశ్చర్యపోవటం నావంతైంది. మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన సంఘటనల పట్ల ఆసక్తి కనపరుసూ ఎప్పటికప్పుడు వారు వాటి గురించి తెలుసుకుంటున్నారంటే మాతృదేశం పట్ల వారికున్న ఆపేక్ష-అభిమానం ఎంతగానో తేటతెల్లమౌతున్నాయి. గాంధీటోపి-పంచెకట్టు-కోటుతో ఉన్న పండిట్ జగన్నాధ మాణిక్యం చక్కని తెలుగులో సంభాషించారు.

ర్యాలీ ముగిసిన తరువాత మారిషస్ ఆంధ్ర ప్రముఖుడు శ్రీ స్వామి, ఆయన కుమార్డు శ్రీ ప్రమోద్ కోరమండల్ బియోబాసిన్లో వారింటికి తీసుకుని వెళ్ళారు. శ్రీ స్వామి తాము నడుపుతున్న సూపర్ మార్కెట్టుని చూపించి మారిషస్ దేశపు టీ పేకెట్లను మాకు బహూకరించారు. వారింటి నుండి హైద్రాబాద్ మా చెల్లెలుతో ఫోనులో మాట్లాడి మా యోగక్షేమాలు తెలిపాము. శ్రీ స్వామి కుమార్డు శ్రీ ప్రమోద్ పోలీసు డిపార్ట్‌మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను రాజస్థానీ వనితను పెళ్ళి చేసుకున్నాడు.

ఆ రాత్రి బియోబాసిన్ మేయర్ శ్రీ రాజేష్ ఎ. భగవాన్ రోజ్‌హిల్ లోని టౌన్‌హాల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. టౌన్‌హాల్ చాలా అందమైన కట్టడం. డైనింగ్‌హాలూ, చక్కని మినీ ధియేటర్ కూడా ఉన్నాయి. పాశ్చాత్య పద్ధతిలో జరిగిందా విందు. అంతకు ముందు జరిగిన విందులకది పూర్తిగా భిన్నంగా ఉంది. మద్య పానీయాలు కూడా విందులో చోటు చేసుకున్నాయి. అవి త్రాగని వారికోసం పైనాపిల్‌జ్యూస్ ఇచ్చారు. మాంసాహారం-శాకాహారం రెండూ వడ్డించారు. మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ ఎస్.సి. ప్రసాద్ నాతో కలసి తమ దేశపు సంస్కృతీ, ఆచారాలను గురించి ముచ్చటించారు. విందులో మారిషస్ మంత్రులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఎన్నినాళ్ళ స్వప్నమిది

డిశెంబర్ 10 వ తేది ఉదయమే మేము విడిది చేసిన గోల్డ్‌క్రిస్ట్ హోటల్ హడావిడిగా కళ కళ లాడుతూ ఉంది. బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని తృతీయ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవానికి ప్రతినిధులు బయలుదేరటానికి సిద్ద మౌతున్నారు. ఒక సుందరస్వప్నం నిజమౌతోంది-ఋజవౌతోంది. అందరిలో ఏదో ఉద్వేగం.. ఉత్సాహం.