పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 శ్రీ గోపాలరాజ్ భట్ బృందం వారి జానపద నృత్యాలు మారిషస్ దేశస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీయుతులు అనిల్‌కుమార్, ఎ.వి.శ్రీధర్, కుమారి ఆరతి, కుమారి కీర్తి, కుమారి ప్రీతి, శ్రీమతి సుబ్బలక్ష్మి ప్రదర్శించిన కోయ, లంబాడి నృత్యాలు ప్రేక్షకుల్ని ఆనంద పరవశుల్ని చేశాయి.

రంగస్థల రారాజ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయ్డు "రారాజు" ఏకపాత్రాభినయం ప్రేక్షకులను పరవశుల్ని చేసింది. భాష వారికి అర్ధంకాక పోయినా అందులో చమత్కారం వారికి తెలీక పోయినా శ్రీ నాయుడుగారి గంభీర పద విన్యాసాలకు, హావ భావాలకు, వారి నటనా చాతుర్యానికి అడుగడుగునా ప్రశంసా పూర్వకమైన కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమ్రోగి పోయింది. వారు ధీర గంభీరంగా వేదిక వైపు నడుస్తూ దానిని అధిరోహించటమే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అదీకాక సంధ్యా సమయంలో జరిగిన ఆ కార్యక్రమం సమయంలో అంతకు ముందే చిరుజల్లులు పడి వెలిసి మబ్బుల చాటునుంచి సూర్యుడు దోబూచులాడు తున్నాడు. సూర్యుణ్ణి మబ్బులు మూస్తూ... అంతలోనే ప్రక్కకు తప్పుకోవటంలో సంధ్యా కాంతులు తళుకుమని నాయ్డుగారు ధరించిన విలువైన జరీ దుస్తులపై పడి వింత కాంతుల్ని విరజిమ్మ సాగాయి.

మాములుగా ప్రదర్శన పమయంలో వాడే ఫోకస్‌లైట్లు ఆ సమయంలో లేకపోయినా సహజమైన వెలుగులు జిగేల్మనిపిస్తూ కాంతులు వెదజల్లి అందరినీ ఆహ్లాద పరిచాయి.

తెలంగాణా జానపద కళారూపమైన 'ఒగ్గు కధ ను శ్రీ మిద్దే రాములు, శ్రీ ఆయిలయ్య వినిపించి ప్రేక్షకులను ఆనందింప చేశారు.

శ్రీ సంపత్ కుమార్'ఆంద్ర జాలరి" నృత్యం ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసింది. శ్రీ రమణమూర్తి వాయిద్య సహకారం తోడు కాగా తన నృత్య విన్యాసాలతో ఆయన మారిషస్ వారి హృదయాలను ఆకట్టుకున్నారు.

లబ్ద ప్రతిష్ఠులైన ఆంధ్ర కళాకారులు తమ ప్రదర్శనలతో మారిషస్ దేశస్థులను ఆకర్షించి, ఆనంద పరిచారనటంలో ఎట్టి సందేహం లేదు. ఈ ప్రదర్శనలు చూచి తన్మయులైన మారిషస్ టెలివిజన్ వారు ప్రత్యేకంగా వాటిని తమ దేశంలో ప్రసారం చేయుట కోసం చిత్రీకరించారు.

ఊరేగింపులో పాల్గొనటానికి చాలామంది వృద్ధులు సహితం తరలి వచ్చారు. వారిలో ఎనభైఏళ్ళు పైబడిన వృద్ధమూర్తి పండిట్ జగన్నాధ మాణిక్యం స్టేడియంలో