పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రోజ్‌హిల్ లోనిప్లాజా ధియేటర్ వద్ద నుంచి స్టేడియం వరకు తెలుగు మహాసభల సందర్భంగా మారిషస్ తెలుగు వారు పెద్ద ఊరేగింపు నిర్వహించారు. తెలుగు వారు పిల్లా పాపలతో ఆ ప్రదర్శనకు తరలివచ్చితమ మాతృ భాషాభిమానాన్ని చాటుకున్నారు, తెలుగు తల్లి, శ్రీ వెంకటేశ్వర స్వామి తదితర అంశాలతో అలంకృతమైన శకటాలు ఆ ప్రదర్శనలో పాల్గొన్నాయి. రంగు రంగుల పరికిణీలు, ఓణీలూ ధరించిన ఆంధ్ర బాలికలు కోలాట మాడుతూ ముందు నడిచారు.

ప్రదర్శన ప్రారంభమయిన కొంత సేపటికే వాన చినుకులు ప్రారంభం అయినాయి. అయినా ప్రదర్శన ఆగకపోవటం... ప్రదర్శకులు చెక్కు చెదరకపోవటం విశేషం. సమధికోత్సాహంతో ఊరేగింపు సాగి రోజ్‌హిల్ స్టేడియంకు చేరుకుంది. మారిషస్ ప్రభుత్వమంత్రులు, శ్రీ అర్ముగం పరశురామన్, శ్రీ ఉచ్చన్న ఊరేగింపు అగ్రభాగాన నడిచారు.

రోజ్‌హిల్ స్టేడియం స్త్రీ పురుషులతోనూ, బాలబాలికలతోనూ నిండింది. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు సతీ సమేతంగా విచ్చేసి కళాప్రదర్శననూ, ఊరేగింపునూ తిలకించారు.

సంస్కృతి తరంగ - సంగీత రసధుని

సాంస్కృతిక ప్రదర్శనలు మారిషస్ తెలుగు ఆడపడుచు శ్రీమతి ప్రమీలా రామన్న లలిత సంగీతాలాపనతో ప్రారంభమైనాయి. "కొండలలోనెలకొన్న కోనేటి రాయుడు" కీర్తన అత్యంత అద్బుతంగా పాడిందామె. విశేషమేమిటంటే శ్రీమతి ప్రమీలా రామన్నకు తెలుగు చదవటం, వ్రాయటం తెలియదు. పాటను ఇంగ్లీషులో వ్రాసుకుని పాడిందని అక్కడి వారు చెబితే ఆశ్చర్యపోయాం. సంగీతం నేర్వని ఆమె కేవలం ఆడియో కేసెట్ ద్వారా అన్నమాచార్య కీర్తనని నేర్చుకుని సుమధురంగా ఆలపించి జనరంజనం చేయటం ఆమెలోని సంగీత తృష్ణకు నిదర్శనం.

మారిషస్ ఆంధ్ర యువకులు శ్రీ రాజన్ అప్పడు, శ్రీ సురేన్ అప్పడు శంకరాభరణం చిత్రం లోని పాటలు చాలా బాగా పాడారు. వీరిని మారిషస్ ప్రభుత్వం విదేశాలకు సాంస్కృతిక బృందాలలో పంపి ప్రోత్సాహించిందని అక్కడివారు చెప్పారు. వీరిద్దరికీ కూడా తెలుగు చదవటం రాదట. మారిషస్ ఆంధ్రుల లలిత సంగీత కచేరీ ముగిసిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక బృందం వారి కళాప్రదర్శనలు మొదలియ్యూయి.