పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీ.శ. 1500 పూర్వమే శ్రీ సిద్దేంద్రయోగి సృష్టించిన కూచిపూడి నృత్యాన్ని మారిషన్ లో శ్రీమతి రాధారెడ్డి, శ్రీ రాజారెడ్డిలు తమ ప్రతిభతో రక్తి కట్టించారు.

తర్వాత డాక్టర్ ఎల్లావెంకటేశ్వర్రావు మృదంగనాదవిన్యాసాలు హృదయానంద భరితుల్ని చేశాయి. దక్షిణ భారతదేశంలో తాళవాద్యాలలో మృదంగానిది అగ్రస్థానం. త్రిపురాసుర సంహార మొనర్చిన పిదప మహాదేవుడు జయసూచకంగా నొనర్చిన నాట్య మందు హంగు చేయుట కొరకు బ్రహ్మమృదంగమును సృష్టించెనని, మొదట గణేశుడు వాయించెనని పురాణగాధ. ఈశ్వర అంశతో కూడుకొనిన మృదంగమును చేబట్టి, తన పాండిత్య ప్రతిభతో అంతర్జాతీయ కీర్తినార్జించి అఖండ విఖ్యాతి సాధించిన మార్దంగికాగ్రేసరులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు. మృదు అంగమైన మృదంగంతో శివతాండవం చేయించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాదులలో ముంచెత్తారు శ్రీ ఎల్లా, ఆయన మన తెలుగు వారు కావడం మనకు సదా గర్వ కారణం.

ధ్వన్యనుకరణ సామ్రాట్టు, ధ్వన్యనుకరణ చక్రవర్తి డా॥ నేరెళ్ళ వేణు మాధవ్ 'మిమిక్రీ' ప్రేక్షకులను మైమరిపించి ఆడిటోరియం లో నవ్వులు జల్లులు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ లో ధ్వన్యనుకరణ, వెంట్రిలాక్విజంలను ప్రవేశపెట్టిప్రాచుర్యం సంతరించి పెట్టిన ఘనత శ్రీ వేణు మాధవ్ కే దక్కుతుంది.

ధ్వన్యనుకరణ విద్యలో శ్రీ వేణు మాధవ్ ఈ తరం మిమిక్రీ కళాకారులకు ద్రోణాచార్యుల వంటి వారు. మిమిక్రీ చేస్తానంటూ మైక్ ముందు నిలబడే ప్రతి ఔత్సాహిక మిమిక్రీ కళాకారుడు ఆయనకి ఏకలవ్య శిష్యుడే.

ధ్వన్యనుకరణకు స్వరాష్ట్రంలోనూ, స్వదేశంలోనూ పేరు ప్రఖ్యాతులు తేవడమే కాకుండా విదేశాలలో సహితం విశేషమైన గుర్తింపును తెచ్చిన కళాకారుడు శ్రీ వేణు మాధవ్.

సౌందర్యరాశి మారిషస్

ఎనిమిదోతేదీ ఉదయం మారిషస్ దేశ ప్రకృతి రమణీయతను తిలకించటానికి వ్యానుల్లో బయలుదేరాం. వీధులు పరిశుభ్రంగా, అద్దంలానిగనిగ లాడుతూంటాయి. ఆ చక్కటి రహదార్లపై ఎంత దూరం ప్రయణం చేసినా అలుపూ సొలుపూ ఉండదు. కారు చాలా వేగంగా నడుపుతారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. వీధి మలుపుల్లో నెమ్మదిగా పోనీయటం, ఎదురుగా వస్తున్న కారును చూసి ఆపుకుని అది వెళ్ళిన తరువాత ముందుకు వెళ్ళటం అక్కడి వాళ్ళ జాగ్రత్తకూ, క్రమశిక్షణకూ నిదర్శనం.