పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొంబాయి నుంచి మారిషస్ నాలుగువేల ఆరువందల తొంభైకిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం మాల్దీవులు, నేషల్స్ మీదుగా ఎగురుతున్నప్పడు అవి అరుంధతీ నక్షత్రాల్లా మిణుకు మిణుకు మంటూ కనిపించాయి. మహాసాగర మధ్యంలో "ఇయర్ ఫోన్స్"లో సంగీతం వింటూ నిదురలోకి జారుకున్నాం. విమానంలో మొదలైన సందడికి మెలకువ వచ్చింది మాకు. ఒక్కొక్కరే టాయిలెట్‌కి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఎయిర్ హోస్టెస్లు ఉడుకులోన్ లో తడిపిన వేడి కాగితాలు ఇచ్చారు. వాటితో మొహం తుడుచుకుంటే ఎంతో హాయిగా అనిపించటమే కాకుండా బద్దకం వదిలి నూతనోత్సాహం కలిగింది.

విమానం కిటికీ లోంచి చూస్తోంటే పైన వినీలాకాశం - క్రింద మహాసాగరం తప్ప వేరే ఏం కనిపించలేదు. మేఘాలు మా విమానాన్ని త్రాకుతూ పరుగులు తీస్తున్నాయి. అరుణ కిరణాల మధ్య సూర్యోదయం ఒక అద్భుత దృశ్యంగా గోచరించింది.

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా

1990 డిశంబరు 7వ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలు కావొస్తోంది. విమానం ప్లెజన్‌స్ లోని సర్ శివసాగర్ రామగులామ్ విమానాశ్రయంలో దిగుతున్నట్టు పైలెట్ ఎనౌన్స్ చేశారు. మారిషస్ చేరుతున్నప్పటికీ పరాయిగడ్డ మీద కాలుమోపు తున్నట్టు కాకుండా మన వాళ్ళ మధ్యకి వెడుతున్న అనుభూతికి హృదయం లోనయ్యింది. విమానం అద్దాల గుండా క్రిందకు చూస్తూంటే అది సముద్రం పైన దిగుతోందా అన్న భ్రమ కలిగింది. నిజానికి సముద్రతీరాన ఉన్న విమానాశ్రయంలో దిగుతోంది అది.

మనకు మహాత్మాగాంధీ జాతిపిత అయినట్టు మారిషస్ ప్రజలకు సర్ శివసాగర్ రామ్ గులామ్ జాతిపిత అందుకే విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. సర్ శివసాగర్ రామ్ గులామ్ బీహార్ ప్రాంతం నుండి మారిషంకు వలస వెళ్ళిన భోజపురి మాట్లాడే ఓ బీద కుటుంబంలో జన్మించాడు. ఇంగ్లాండులో చదివి డాక్టర్ అయినాడు.

1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి వెళ్ళిన మహాత్మాగాంధీని రామ్‌గులామ్ కలుసుకుని వలస దేశాల విమోచనోద్యమాన్ని గురించి చర్చించారు. ఆయనపై గాంధీ ప్రభావం మిక్కుటంగా వుంది.