పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 మా దివిసీమలో సిద్ధేంద్ర యోగి సృష్టించిన కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక విశిష్టమైన కళగా ప్రాచుర్యం సంపాదించి జంట నగరాలలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు ఉజ్వల శ్రీ మందడి కృష్ణారెడ్డి ప్రతినిధిగా మాతో మారిషస్‌కు బయలుదేరారు.

ఇంతలో నాన్నగారు విజయవాడ అశోకా బుక్‌సెంటర్ అధినేత శ్రీఅశోక్ కుమార్ ను నాకు పరిచయం చేశారు. వారి తల్లిగారు, మా నాన్నగారు కాలేజీలో క్లాస్ మేట్స్‌ట. శ్రీ అశోక్ కుమార్ తెలుగు మహాసభలలో పుస్తక, వస్తు ప్రదర్శన నిర్వహించటానికి మారిషస్ వస్తున్నారు. మా తనిఖీ కార్యక్రమం పూర్తవ్వగానే విమానాశ్రయం లాంజ్ లో ప్రవేశించాం. అక్కడ ఏంకొనాలన్నా డాలర్లనే వాడాలి. ఒక్కొక్క కాఫీకి డాలర్ చొప్పున చెల్లించి త్రాగాం.

ఆకాశవీధిలో అందమైన అనుభూతి

ఎయిర్ మారిషస్ విమానంలోకి అడుగు పెడ్తుండగానే ఆ దేశాన్ని చేరుతున్న అనుభూతి హృదయాన్ని తాకింది. దాదాపు 250 మంది ప్రయాణించటానికి వీలున్న అత్యాధునిక విమానం అది. మా సీట్ల నెంబరు ప్రకారం కూర్చున్నాం.

ఆ విమానంలో మూడు తరగతులున్నాయి. శ్రీమతి జమున మొదటి తరగతి లోనూ, డాక్టర్ నారాయణరెడ్డి, అక్కినేని బిజినెస్ తరగతి లోనూ, మిగిలిన వాళ్ళం ఎకానమీ తరగతి లోనూ కూర్చున్నాం.

విమానంలో ముప్పై మంది తెలుగు ప్రతినిధులం మినహాయిస్తే మిగిలిన వారు విభిన్న సంస్కృతులకు, విభిన్న దేశాలకు చెందినవారు. ఎక్కువగా మారిషస్‌లో నివసిస్తున్న భారతీయ సంతతివారే. విమానంలో కూర్చోగానే సంగీతం విని ఆనందించటానికి "ఇయర్ ఫోన్స్" తెచ్చి ఎయిర్ హోస్టెస్ ఇచ్చింది. ఏడు ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కో ఛానల్లో ఎవరి అభిరుచికి తగిన సంగీతం వారు వినవచ్చు. ఇంగ్లీషు సినిమాలు, న్యూస్ రీలు కూడా ప్రదర్శిస్తున్నారు. రాత్రి రెండు గంటలకు ఎయిర్ హోస్టెస్ మాకు భోజనం సర్వ్ చేశారు.

శాకాహార, మాంసాహారాలతో బాటు విమానంలో ప్రయాణీకులకు హాట్ డ్రింక్స్... కూల్‌డ్రింక్స్... జ్యూసెస్ సర్వ్ చేస్తారు. ఆకాశవీధిలో విమానంలో ఆ నిశిరాత్రి పయనిస్తూంటే వింత వింత అనుభూతికి మనసు లోనైంది.

భూమి నుంచి దాదాపు ముప్పైతొమ్మిదివేల మైళ్ళ ఎత్తున, గంటకు ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో విమానం మారిషస్ వైపు ఎగురుతోంది.