పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పాటు చేసి పారితోషికంగా ఎంతఇచ్చినా లెక్కపెట్టుకోకుండా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే ఉన్నతమైన కళాకారుడు. వారితో దాదాపు రెండు దశాబ్దాల స్నేహపూర్వక అనుబంధం వుంది. తెలుగు నాటకరంగం గురించి సాధికారంగా మాట్లాడగల మంచి వక్త శ్రీ నాయ్డుగారు.

విజయనగరానికి చెందిన నృత్య కళాకారుడు శ్రీ సంపత్‌కుమార్, 'ఆంధ్ర జాలరి" నృత్యంతో ప్రపంచప్రసిద్ధిగాంచారు. ఆ అంశం ఆయనకు దేశ విదేశాలలో అనంతమైన కీర్తిని ఆర్జించిపెట్టింది. శ్రీ సంపత్ కుమార్‌తో నాకు 15 సంవత్సరాల పరిచయం వుంది. అన్నమాచార్యకీర్తనలతో అంతర్జాతీయ కీర్తిని ఆర్జించిన శ్రీమతి శోభారాజ్ అప్పడే మొదటిసారి కలవటం. రేడియో, టి.వీ.లద్వారానే అంతవరకూ ఆ కళాకారిణి నాకు తెలుసు. ఆమె భర్త శ్రీ డా.నందకుమార్ అందరిలో ఎంతో కలివిడిగా తిరుగుతూ ప్రయాణంలో మాకెంతో సహాయం అందించారు

ప్రముఖ జానపద నృత్య కళాకారుడు శ్రీ గోపాలరాజభట్ తన బృందాన్ని తీసుకుని మారిషస్ వస్తున్నారు. శ్రీ భట్ బృందం జానపద నృత్యాలు చూచి ఆనందపరవశులు అవ్వాలేకాని మాటలతో వారి నృత్య ప్రదర్శనను గురించి వర్ణించి చెప్పటం సాధ్యం కాదు. మన జానపద నృత్య సంపదను మారిషస్ వారికి చూప తలపెట్టడం చాలా ప్రశంసనీయం. 1977 లో దివిసీమ ఉప్పెనకు గురై ప్రజలు శోకతప్తులై ఉన్నప్పుడు శ్రీ భట్ తన బృందంలో తరలి వచ్చి ప్రదర్శనలిచ్చి ప్రజలకు ఊరట నివ్వటానికి ప్రయత్నించటం నాకు ఏనాటికీ మరుపురాదు.

తెలంగాణాలో ప్రాచుర్యం పొందిన జానపద కళారూపం "ఒగ్గు కధ" ను వినిపించటానికి మిద్దె రాములు, ఎ.అయిలయ్యల బృందం వస్తున్నది. అచ్చమైన జానపదులుగా. తెలంగాణా గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబాలుగా వారు విమానాశ్రయంలో దర్శనం ఇచ్చారు. పొట్టిగా, ఎర్రగా ఎఱ్ఱచీర కట్టుకుని నిలబడి ఉన్నదొకామె. ఆమెకు చేరువలో పొడుగుగా చామన ఛాయ మేనితో రాజస్తానీ అహుబూట్లు, గోధుమరంగు చుడీదార్ పైజమా, లాల్చీ ధరించి ఉన్నాడొకాయన. వారిని చూడగానే కళాకారులని ఎవరికైనా స్పురిస్తుంది. వారి ముఖాలు పరిచయం ఉన్నట్లుగా అనిపించినా అంతకు ముందు వారిని చూసినట్టు గుర్తు రావడం లేదు. వారెవరని ప్రక్కనున్న వారిని అడిగితే జగత్ర్పసిద్ధ కళాకారులు శ్రీమతి రాధారెడ్డి శ్రీ రాజారెడ్డి అని చెప్పారు. వారినిమా నాన్నగారు పరిచయం చేశారు నాన్నగారి పట్ల ఆ దంపతులు ఎంతో గౌరవం, ఆదరణ చూపించారు.