పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 నాన్నగారు 1983లో ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్న ఫలితంగా రెండుసార్లు చేతికి, ఒకసారి మెదడుకు శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది.

ఆ శస్త్రచికిత్స వలన ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, శారీరకంగా బాగా నీరసపడిపోయారు. ప్రయాణంలో ఆయన వెంట తోడు ఎవరో ఒకరు వుండవలసిందే. ఈ పరిస్థితిలో నాన్నగారికి తోడుగా నేను కూడా మారిషస్ ప్రయాణం కావల్సి వచ్చింది.

ఆ స్వల్ప వ్యవధిలోనే మాకు పాస్‌పోర్టులూ, టిక్కెట్టు సాధించిపెట్టగలిగారు తెలుగు విశ్వ విద్యాలయం వారు. ఈ సందర్భంగా మాకు తోడ్పడిన డా॥ ఎన్. శివరామమూర్తి, డా॥ గౌరీ శంకర్, థామస్ కుక్ కంపెనీకి చెందిన శ్రీమతి గౌరి, శ్రీ చంద్రశేఖర్‌గార్ల సహాయం మర్చిపోలేనిది.

1990 డిసెంబర్ 6వ తేదీన ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుండి బొంబాయికి విమానంలో బయలుదేరాం. మా కుటుంబ సభ్యులు, అనేకమంది బంధుమిత్రులూ విమానాశ్రయానికి వచ్చి సాదరంగా వీడ్కోలు చెప్పారు. బొంబాయిలోని మా మిత్రులు శ్రీ సుంకర అంజయ్యనాయుడు విమానాశ్రయానికి కారు పంపారు. ఆ రోజు వారింట బసచేశాం. తెల్లవారుఝామున మారిషస్‌కు మా ప్రయాణం. రాత్రి 11 గంటలకే విమానాశ్రయానికి చేరాం. పాస్‌పోర్టుల తనిఖీ, ఇతర నియమ నిబంధనలను పూర్తిచేశాం.

బొంబాయి విమానాశ్రయంలో తెలుగు వెలుగులు

తెలుగు దిగ్గజాలతో బొంబాయి సహారా అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడిపోతోంది.

తెలుగు వెలుగుల అపూర్వ సంగమం అద్బుతదృశ్యంగా మనసుని రంజింపచేస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం నాయకులు డా॥ సి. నారాయణరెడ్డిగారు ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం అధికారులకు సూచనలు యిస్తున్నారు.

మారిషస్‌లో తెలుగు చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించడానికి నటసామ్రాట్ డా॥ అక్కినేని నాగేశ్వరరావుగారు మారిషస్‌కు ఆహ్వానించబడ్డారు. ఆరు పదులు దాటినా, నవయువకుడ్ని తలపింపచేస్తూ టక్ చేసుకుని, మెడ చుట్టూ శాలువా లాంటి ఉత్తరీయంతో నటసామ్రాట్ విమానాశ్రయంలో హుషారుగా కలయ తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ, ఛలోక్తులతో ప్రతివారిని ఆకర్షించసాగారు. అదే సమయంలో