పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఈ లోపుగా డా॥ మర్రి చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిపదవి నుండి వైదొలగడం, శ్రీ టంగుటూరి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించటం జరిగింది.

శ్రీ బాట్టం శ్రీరామమూర్తిగారు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అయ్యారు. శ్రీ అంజయ్యగారు మలేషియాలో తెలుగు మహాసభల నిర్వహణకు సుముఖత చూపి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారిని అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమించి మహాసభల నిర్వహణకు పూనుకున్నారు.

మలేషియా మహాసభలలో పాల్గొనాలని ఆంధ్ర ప్రజలు అత్యుత్సాహం చూపడం. విమాన ప్రయాణ ఏర్పాట్లలో రసాభాస జరిగినప్పటికీ మొత్తానికి ద్వితీయ ప్రపంచ తెలుగుమహాసభలు బాలారిష్టాలను అధిగమించి ద్వితీయ విఘ్నాన్ని చూడకుండా 1981 ఏప్రిల్‌లో కౌలాలంపూర్‌లో విజయవంతంగా జరిగాయి. అంతర్జాతీయ తెలుగు సంస్థ, మలేషియా ఆంధ్ర సంఘం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో యీ సభల నిర్వహణ భారం మోశాయి.

మారిషస్‌లో తృతీయ ప్రపంచ తెలుగుమహాసభలు-పూర్వరంగం

మలేషియాలో ద్వితీయ ప్రపంచ మహాసభలలో పాల్గొన్న మారిషస్ ప్రతినిధులు తృతీయ తెలుగు మహాసభలు తమ దేశంలో జరుపుతామని ముందుకు వచ్చారు.

ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకైన పాత్ర నిర్వహించిన డాక్టర్ బి.కృష్ణంరాజు 1989 లో మారిషస్ లో జరిగిన విశ్వహిందూ సమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్ళారు.

డాక్టర్ కృష్ణం రాజు తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ గురించి మారిషస్ ఆంధ్రులతోనూ, ప్రభుత్వ నేతలలోనూ చర్చలు జరిపారు. వారిలో ఉత్సాహాన్ని రేపి మహాసభల నిర్వహణకు పురికొల్పారు.

డా॥ కృష్ణం రాజు రేకెత్తించిన ఉత్సాహంతో మారిషస్ ఆంధ్ర మహాసభవారు ఒక చిన్న కమిటీని ఏర్పర్చుకుని కార్యనిర్వహణకు ఉపక్రమించారు.

మారిషస్ నుంచి తిరిగి వచ్చిన డా॥ కృష్ణం రాజుగారు హైద్రాబాద్‌లో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ తరువాత మారిషస్ మంత్రి శ్రీ పరశురామ్ వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావుగారితో చర్చించడం, మహాసభల