అనుచ్ఛేదము 27. (i) సమాజముయొక్క సాంస్కృతికజీవితమునందు స్వేచ్ఛగా పాల్గొనుటకును, కళా విషయికానందము ననుభవించుటకును, శాస్త్ర ప్రగమనములందును, తత్ఫలితములందును సహభాగి యగుటకును, ప్రతి వ్యక్తికిని హక్కు గలదు.
- (ii) తన కర్తృత్వముచే సముత్పన్నములయిన శాస్త్ర, సారస్వత, కళా, రచనల వలన సిద్ధించిన నైతిక-ఆర్థిక లాభములను రక్షించుకొనుటకు ప్రతి యొకరికిని హక్కు గలదు.
అనుచ్ఛేదము 28. ఈ ప్రకటన యందు పొందుపరుపబడియున్న స్వత్వ స్వాతంత్ర్యములు సంపూర్ణముగా సిద్ధింపగల ఒక సాంఘిక అంతర్ -రాష్ట్రీయవ్యవస్థకు, ప్రతి వ్యక్తికి నధికారము గలదు.
అనుచ్ఛేదము 29. (i) సమాజమునందు మాత్రమే మానవ వ్యక్తిత్వము స్వేచ్ఛగా, సంపూర్ణ వికాసము నొందుటకు అవకాశము గలదు. కనుక, సమాజము నెడ ప్రతియొకరును నిర్వహింపవలసిన కర్తవ్యములు గలవు.
- (ii) తమ స్వత్వములను, స్వాతంత్ర్యములను, ప్రయోగించుటలో ప్రతియొకరును, ఇతరుల స్వత్వ స్వాతంత్ర్యముల యెడ అర్హాంగీకారగౌరవములను సురక్షితపరుచు నుద్దేశముతోను, మరియు, ప్రజాస్వామిక సమాజమునందు నీతి, సామాజిక వ్యవస్థ, సార్వజనికస్వాస్థ్యములకు, న్యాయముగ అవసరములగు వానిని కూర్చు నుద్దేశముతోను మాత్రమే, విధిచే నిశ్చయింపబడినట్టి నిబంధనలకు మాత్రమే ఆధీనులయియుందురు.
- (iii) ఈ స్వత్వములు, స్వాతంత్ర్యములు, ఐక్య రాష్ట్రముల ఆశయములకును నియమములకును విరుద్ధముగా నెన్నడును బ్రయుక్తములు గారాదు.
అనుచ్ఛేదము 30. ఈ ప్రకటనలో పొందుపరుపబడియున్న ఏ స్వత్వ స్వాతంత్ర్యములనైనను నాశము చేయుటకుద్దిష్టమగు నెట్టి కార్యమునయిన నాచరించుటకుగాని, అట్టి కార్యాచరణమున ప్రవర్తించుటకు గాని, ఏ రాజ్యమునకైనను, లేక వర్గమునకైనను, వ్యక్తికైనను, అధికారము కలిగించునదిగ వివక్షితమయియున్నట్లుగా, ఈ ప్రకటనము నందున్న దేనికిని వ్యాఖ్యానము చేయకూడదు.
Universal Declaration of Human Rights
TELUGU
Printed in U.S.A.