పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముల ప్రకటనను సదా మనసునందుంచుకొని, ఉపదేశ విద్యాబోధలచే వీనియెడ గౌరవమును పెంపొందించుటకును, మరియు, రాష్ట్రీయములు నంతర్ రాష్ట్రీయములునగు నభ్యుదయ విధానముల ననుసరించి వ్యక్తిరాజ్యములలోని ప్రజల యందును, నా రాజ్యముల యధికారమునకు లోబడియుండు క్షేత్రములలోని ప్రజలయందునుగూడ, నీ స్వత్వస్వాతంత్ర్యముల ఫలకారక అంగీకారానుష్ఠానములను సార్వలౌకికముగ సునిశ్చితము చేయుటకును ప్రయత్నించవలెను, ఇట్టి యాశయముతో సకల మానవులకును రాష్ట్రములకును సమాన ప్రమాణమును సంపాదించునదిగా నీ మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటనను సర్వజనీన పరిషత్తు ఉద్ఘోషించుచున్నది.

అనుచ్ఛేదము 1. ప్రతిపత్తిస్వత్వముల విషయమున మానవులెల్లరును జన్మతః స్వతంత్రులును సమానులును నగుదురు. వారు వివేచన-అంతఃకరణ సంపన్నులగుటచే పరస్పరము భ్రాతృభావముతో వర్తింపవలయును.

అనుచ్ఛేదము 2. (i) జాతి, వర్ణము, లింగభేదము, భాష, మతము, రాజకీయాభిప్రాయభేదము, రాష్ట్రీయము లేక సామాజికమునగు జననము, ఆస్తి, కులీనత, ప్రతిష్ఠ,—ఇత్యాది యెట్టి విభేదము గాని పాటింపబడక,- ఈ ప్రకటనలో పొందుపఱుపబడియున్న స్వత్వస్వాతంత్ర్యముల కన్నిటికిని ప్రతి యొకరికి నధికారము కలదు.

(ii) స్వతంత్రముగను, న్యాసముగను, ఆస్వాయత్తశాసకక్షేత్రముగను, లేక, అవధితాధిరాజ్యమునకు లోబడినదిగను నుండు నెట్టిదేశమునకు గాని, రాజ్యక్షేత్రమునకు గాని ఒక వ్యక్తి చెందియున్న కారణమునుబట్టి ఆ దేశముయొక్క లేక, ఆ క్షేత్రముయొక్క రాజకీయాధికారిక అంతర్ రాష్ట్రీయ ప్రతిష్ఠలకు సంబంధించిన యెట్టి విభేదముగాని పాటింపబడదు.

అనుచ్ఛేదము 3. జీవితరక్షణకు, స్వేచ్ఛకు, దేహరక్షకు, ప్రతి యొకరికిని హక్కు గలదు.

అనుచ్ఛేదము 4. ఏ వ్యక్తిని గాని బానిసతనమునకును దాస్యమునకును లోనుగావింపగూడదు. అన్ని విధములయిన బానిసతనములును, బానిస వ్యాపారములును నిషేధింపబడవలెను.

అనుచ్ఛేదము 5. ఏ వ్యక్తినిగాని, క్రూరము, అమానుషము, నికృష్టము నగు ప్రయోగమునకును శిక్షకును గురి చేయరాదు.