Universal Declaration of Human Rights - Telugu
మానవస్వత్వముల
సార్వలౌకెక ప్రకటన
ప్రస్తావన
మానవకుటంబమునందలి వ్యక్తులందరికిని గల ఆజన్మసిద్ధమైన ప్రతిపత్తిని, అనన్యాక్రాంతములగు సమానస్వత్వములను అంగీకరించుట ప్రపంచమున స్వాతంత్ర్య, న్యాయ, శాంతుల స్థాపనకు పునాది యగును.
మానవజాతి అంతఃకరణమును క్షోభపెట్టిన ఘోరచర్యలు, మానవస్వత్వములయెడ గలిగిన అవజ్ఞా నిరసన భావముల పరిణామమనియు, వాక్స్వాతంత్ర్య ప్రత్యయస్వాతంత్ర్యములను, భయవిముక్తిని, దారిద్ర్యవిముక్తిని మానవులు ఎల్లరు అనుభవించుటకు వీలగు లోకముయొక్క ఆవిర్భావమే సామాన్యప్రజానీకముయొక్క మహోన్నతమైన అభికాంక్షయనియు ఉద్ఘోషింపబడియున్నది.
నిష్ఠురపాలనా ప్రజాపీడనములపై, గత్యంతరము లేక, మానవుడు తిరుగుబాటు చేయవలసిన బలాత్కార పరిస్థితులు ఏర్పడకుండ నుండవలయునన్నచో మానవస్వత్వములు విధినియమముచే పరిరక్షితములగుట ముఖ్యము.
రాష్ట్రముల మధ్య సౌహార్దబాన్ధవ్యముల అభివృద్ధికి దోహదము చేయుట అత్యావశ్యకము.
మానవుల మూలస్వత్వముల యందును, వ్యక్తుల ప్రతిపత్తి యోగ్యతలయందును, స్త్రీపురుషులకు గల సమాన స్వత్వములయందును, తమకు గల విశ్వాసమును ఐక్యరాష్ట్రములవారు ఈ శాసనపత్రమున పునఃప్రమాణీకరించి, సామాజికాభ్యుదయమును, ఉన్నత జీవిత ప్రమాణములను, విశాల స్వాతంత్ర్యమును పెంపొందించుటకు నిశ్చయించుకొనియున్నారు,
మానవస్వత్వ, మూలస్వాతంత్ర్యములయెడ సార్వలౌకిక గౌరవాభివృద్ధిని, వాని యనుష్ఠానమును ఐక్యరాష్ట్రముల సహకారముతో సాధించుటకు వ్యక్తిరాజ్యములు ప్రతిజ్ఞ చేసికొనియున్నవి,
ఈ స్వత్వములను గూర్చియు, స్వాతంత్ర్యములను గూర్చియు, సాధారణముగ నెల్లరకును తెలిసియుండుట ఈ ప్రతిజ్ఞా సమగ్రసిద్ధికెంతయు ముఖ్యము.
సమాజమునకు చెందిన ప్రతివ్యక్తియు, సమాజము యొక్క ప్రత్యంగమును, ఈ స్వత్వ