పుట:మాటా మన్నన.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దవారి సలహా, అభిప్రాయం కావలసివస్తే పిల్లలు న్యాయంగానే గౌరవిస్తారు. మొత్తంమీద పెద్దవారి సలహాను పిన్నలు పాటించటానికి ఇష్టపడరు. పెద్దవారికి తమ యందు సానుభూతి లేదని, తమ స్థితిగతులు ఆలోచించి మాట్లాడరని వారి విశ్వాసం.

మరొక కష్ట మేమిటంటే, యువజనులలో అధిక సంఖ్యాకులు తీవ్రమైన విషయాలను గురించి పెద్దలతో సంభాషించుటకు జంకుతారు. వారి కాలంలోని కష్టాలను గురించి, సమస్యలనుగురించి, మాట్లాడుటకుకూడా వారు ఇష్టపడరు. ఇంతేగాదు; కొన్ని కొన్ని విషయాలనుగురించి వారు తలిదండ్రులతో సంభాషించుటకు కూడా సందేహిస్తారు. తలిదండ్రులు కొందరు తమ పిల్లలయెడల ప్రేమ, అనురాగం, మొదలగునని అధికంగా చూపించినా వారి మధ్యగల అంతరువు అట్లాగే ఉండిపోతుంది. విద్యనుగురించి, వివాహాన్ని గురించి, ఒక్కొక్కప్పుడు రాజకీయాలను గురించి భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటవి. యువకులు సాధారణంగా తమ స్వాతంత్ర్యాన్ని, చంపుకోరు. తమ అభిప్రాయాలనీ, ఆశయాలనీ, మార్చుకోరు. సాధారణంగా యువజనరక్తం వేడిగా ఉంటుంది. పాత అభిప్రాయాలనూ ఆచారాలనూ వారు వ్యతి రేకించడం సహజం. వారికీ తలిదండ్రులయందు ఎంతప్రేమఉన్నా, వారొకప్పుడు ఇట్లా అంటూ ఉంటారు; “మానాన్న ఈమాట మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉన్నది " కనుక పెద్దలు పెద్దరికాన్ని నిలుపుకోవాలంటే, పిన్నలడిగే వాటికి సమాధానం ఇవ్వటమే మంచిది.

47