పుట:మాటా మన్నన.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ని న్నడిగితే చదివిన పుస్తకాల గురించి నీ అభిప్రాయాలు వివరంగా చెప్పరాదు. ఇది మంచి పుస్తకం; ఇది చెడ్డది అని చెప్పరాదు. అభిరుచుల భేదం. ఇది నాకు బాగుంది- అనాలి. అది నాకు నచ్చలేదు-అనాలి. అసలు అట్లా అంటంకూడా మంచిది కాదు. నీ అభిప్రాయం అతనిపై పనిచేస్తుంది.

కొందరు మతవిషయాలు, రాజకీయాలు మాట్లాడ రాదంటారు. మతవిషయాలనుగురించి తీవ్రమైన భిన్నాభిప్రాయ లుండటం సహజం. అవి మారేవి కాదు. ఎవరికి వారు తమ నమ్మకాలే ముంచివనుకుంటారు. అదీకాక మత విషయం వ్యక్తి సంబంధం.

రాజకీయాలను గురించి తప్పకుండా మాట్లాడాలి. ఈ కాలంలో అవే ప్రధానం. రాజకీయాలు దేశానికి సంబంధించినవి. వాటిల్లో భిన్నాభిప్రాయా లుండటం సహజం, అభిప్రాయాలను గురించి వినటం చర్చించటం అవసరం. దేశ పురోభివృద్ధి వాటిమీదనే ఆధారపడివుంది.

భిన్నాభిప్రాయాలుగల వారితో మాట్లాడకపోతే మంచి చెడ్డలు తెలిసేది ఎట్లా ? తీవ్రమైన వివాదాలలో దిగరాదు. తన అభిప్రాయాన్ని నెగ్గించుకోవాలని ప్రయత్నించరాదు.

మానవులు రూపురేఖలలో ఎట్లా భిన్నంగాఉంటారో అట్లాగే అభిప్రాయాలలోను భిన్నంగాఉంటారు. అభిప్రాయభేదం ఉన్నంతమాత్రాన ఒకరినొకరు హేళన చేసుకోవటం, మూతి ముడుచుకోవటం మంచిది కాదు.

31