పుట:మాటా మన్నన.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ ఇంటి విషయాలు గాని, పరుల గృహకల్లోలాలుగాని మాట్లాడరాదు, రాజకీయ నాయకులను గురించి ప్రముఖులను గురించి అమర్యాదగ మాట్లాడరాదు.

ప్రతివారిని గురించి సానుభూతితో మాట్లాడటం మంచిది. మర్యాద ఇచ్చి మర్యాద తెచ్చుకోమన్నారు. ఇది నీకూ ఇతరులకు కూడా మంచేఅని గ్రహించాలి. ఇది అందరికి అందుబాటులోని విషయం. ఈ మాదిరిగా ప్రవర్తి స్తే లోకం ఎంతో సుఖప్రదంగా ఉంటుంది.

సంభాషణ రాణించే మార్గాలు :

మంచి సంభాషణలో ముఖ్యాంశం, ఇద్దరుగాని ముగ్గురుగాని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని గురించే మాట్లాడరాదు. సంభాషణ సజీవంగా ఉండాలంటే ఒక దానిమీదనుంచి మరొకదానిమీదికి సహజంగా పోవాలి. ఆ విషయాలు అక్కడున్న వారందరికి తెలిసేవిగా వుండాలి. వారి అంతస్థు విద్యాపరిణతి, ఎట్లాఉన్నా ఆ విషయాలు సర్వసామాన్యంగా ఉన్నప్పుడే అవి రాణిస్తవి.

ఆ సంభాషణలో పాల్గొనేవారందరికి ఆమోదప్రదం ఆనందకరంగాను ఉండాలి. ఏవిషయాన్నైనా చక్కగా మాట్లాడగల అదృష్టవంతులు కొందరే ఉంటారు. వారితో మాట్లాడటం ఆనందం, అదృష్టం.

29