పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

69

అని విష్ణుపురాణవచనము నారాయణుకంటే నన్యుడెవ్వడు మహాభారతకర్త కాగల డనుచు మహాభారతకర్తృత్వమును బట్టియే వేదవ్యాసమహర్షి నారాయణావతారమే యని నిరూపించినది.

ఇట్టిస్థితిలో ప్రతివాదులు ఎవ్వకెవ్వరో కర్తలనుచు ప్రమాణ విరుద్ధముగా శబ్దమర్యాదను పాటింపకయే, స్వకపోలకల్పితములతో, పూజ్యమైన మహాభారతమును నానాదురవస్థలకు పాలుచేసినారు. మనము వారి వ్రాతలలోని దోషము నిరూపించుకొనుచువచ్చినాము ఆప్రతివాదులు మహాభారతములోని వ్యాసకృతగ్రంథమునకు జయ మనియే పేరనుటచే జయశబ్దార్థమును గూడ పరిశీలింతము -

ప్రతిపురాణమునకు ఆదిని "నారాయణం నమస్కృత్య...తతో జయ ముదీరయేత్ ” అని యున్నది. శ్రీమద్భాగవత ద్వితీయాధ్యాయ మున కథారంభము చేయు సూతుడు గురునమస్కారానంతరము-

“నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |
దేవీం సరస్వతీం వ్యాసం తతో 2జయ ముదీరయే ||”

అని జయమును చెప్పుచున్నాననియే వచించెను. అచ్చట శ్రీధ రీయమున

“జయ త్యనేన సంసార మితి జయో గ్రన్థః" |

అని వ్యుత్పత్తి చెప్పబడినది. ఇట్లు సర్వగ్రంథసాధారణముగా ప్రయోగింపబడియున్న జయశబ్దమును బట్టుకొని మహాభారతమందు కొంతభాగమునకు జయ మని పేరని వ్రాయుట యుక్తముగాదు, మహా భారతాదియం దుస్న 'నారాయణం నమస్కృత్య తతో జయ ముదీర యేత్ ' అనుచోట నీలకంఠీయ మిట్లున్నది.___