పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

25


(ఇక్కడ ధృతరాష్ట్రాదులు గతించిన తరువాత భారతమును మహర్షి చెప్పె ననగా రచించెనని యర్దము కాదు. పూర్వము బహుకాలమై రచింపబడియున్న గ్రంథమును ప్రకటించెనని యర్థము.అప్పుడాప్రకటించుట మనుష్యలోక విషయము, వక్ష్యమాణప్రకారము దేవపితృగంధర్వలోకములలో గూడ ప్రకటింపబడియుండుటచే నిచట 'మనుష్యలోక మందు' అను విశేషణ ముపపన్నము, మనుష్యలోకమందు ఎప్పుడు ఎట్లు ప్రకటించెను? అను ప్రశ్నముపై సమాధానముగా నుత్తరగ్రంథము)

అదెట్లనిన? సర్పసత్రయాగమందు జనమేజయునిచేతను,అచట వేలకొలది బాహ్మణప్రవరులచేతను :

“కురూణాం పాండవానాం చ భవాన్ ప్రత్యక్ష దర్శివాన్ |
తేషాం చరిత మిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ! "
                                              (ఆది. ఆ. 60)

అని యడుగబడిన వ్యాసమహర్షి తన శిష్యుడగు వైశంపాయనునకు:-

“కురూణాం పాండవానాం చ యథా భేదో౽భవ త్పురా |
 తదస్మై సర్వ మాచక్ష్య య న్మత్త శ్శ్రుతవా నసి! ” (ఆది...అ60)

అని నావలన తెలిసికొనిన భారతమునంతను నీ వీతనికి చెప్పు మని యజ్ఞాపింప నా వైశంపాయనుడు ఆయా సమయములందు ప్రేరే పింపబడుచు, భారతమును వినిపించెను. ఆవినిపింపబడిన భారతమందు కురువంశ విస్తారమును, గాంధారీధర్మశీలతను, విదురప్రజ్ఞను, కుంతీ ధైర్యమును, వాసుదేవమాహాత్మ్యమును, పాండవుల సత్యతను, ధార్తరాష్ట్రుల దుర్వృత్తమును, భగవాను డగు వ్యాసమహర్షి - చెప్పెను.