పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



2

మహాభారతతత్త్వ కథనము

ఈ గ్రంథము "భారతం పంచమో వేదః" అనియు, “సర్వ శ్రుతినమూహో౽యం” అనియు గీర్తింపబడుటచే వేదార్థ వివరణరూపమైన ప్రమాణగ్రంథ మనుటలో సంశయము లేదు. ఇట్టి యీమహాభారతము శబ్దార్థ గాంభీర్యయుక్తమై మూలమాత్రావలోకనమునదురవగాహమై, సకలశాస్త్ర సంప్రదాయసమంచితమై, అజ్ఞాతాశ్చర్యకరానేకాంశోపశోభితమై, అతీంద్రియపదార్థప్రకాశకమై, జగద్ధితమై,విద్వన్మనోజ్ఞమై విరాజిల్లుచున్నది

దీనికి అనేకటీకలున్నను ప్రస్తుతము సంపూర్ణముగా మన కుపలబ్దమగుచు క్లిష్టస్థలములయందు విపులముగా చర్చించి శంకానిరాకరణపూర్వకముగా ప్రమాణప్రదర్శనముతో సిద్ధాంతమును నిరూపించుచుస్నది నీలకంఠీయటీకయే. ఆటీకాకారుడు ఆదియం దిట్లు వ్రాసెను -

“బహూన్ సమాహృత్య విభిన్న దేశ్యాన్
కోశాన్ వినిశ్చిత్య చ పాఠ మగ్య్రమ్
ప్రాచాం గురూణా మనుసృత్య వాచ
మారభ్యతే భారతభావదీపః"

భిన్నదేశములం దున్న బహుకోశములను సంగ్రహించి సాంప్రదాయికమగు పాఠము నిశ్చయించి గురుపరంపరోపదిష్టము లగు వాక్యముల నాధారము చేసికొని 'భారత భావదీపము' అను టీకను ఆరంభించుచున్నాను. అని తాత్పర్యము.

దీనిచే, టీకాకారుడు తనకు లభించిన యేదో యొక కోశమందలి పాఠమును బట్టుకొని తనకు తోచినట్లు ఏదోవిధముగా వ్రాసిన టీక కాక నానాదేశీయబహుగ్రంథపర్యాలోచనముతో సాంప్రదాయికపాఠనిర్ణయముతో గురుపరంపరాప్రసిద్ధమగు ప్రమాణికార్థమును పూర్వోత్తరసందర్భశుద్ధితో నిరూపించుచు వ్రాసినదే యీటీక యని స్పష్ట మగుచున్నది.