పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ గురుభ్యో నమః

ఉపోద్ఘాతము

“వాగీశాద్యా స్సుమనస స్సర్వార్థానా ముపక్రమే|
యం నత్వా కృతకృత్యా స్స్యుస్తం నమామి గజాననమ్"||

“ఇద మన్థం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్|
యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం న దీప్య తే ||
అతః ప్రజానాం వ్యుత్పత్తి మభిసన్ధాయ సూరయః|
వాచాం విచిత్రమార్గాణాం నిబబన్ధుః క్రియావిథిమ్||"

అను ఆచార్యదండివచనానుసారము దేశాంతర కాలాంతరవర్తులును, ఇంద్రియా గోచరములును అగుపదార్థములను ప్రకాశింపజేయు శబ్దాత్మక జ్యోతిస్సు లేనినాడు యీ భువనత్రయమును అంధకారబం ధురమే యనుట నిర్వివాదము. అట్టి శబ్దజాలమునే లోకోపకారమునుకోరి ప్రజల యొక్క బుద్ధివైజాత్యమును బట్టి సుగమముగా లోకులు గ్రహించి తరించుట కుపయుక్తముగా మహర్షి ప్రభృతులు శాస్త్రకావ్యపురాణేతిహాస రూపమున బహువిధ వాఙ్మయము నిర్మించి, మనలననుగ్రహించిరి.

అందు వేదవ్యాసప్రణీత మగు మహాభారత మొకటి. దీని ప్రాశస్త్యము - "ధర్మేచార్థేచ కామే చ మోక్షే చ భరతర్షభ| య దిహాస్తి త దన్యత్ర య న్నేహాస్తి న తత్క్వచిత్" అను వచనముచే చతుర్విధపురుషార్థములలో నీభారతమందు లేని దేగ్రంథమందు లేదనియు దీనియం దున్నదే గ్రంథాంతరమందుండె ననియు బోధింపబడుచున్నది.