Jump to content

పుట:మత్స్యపురాణము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

57


క.

ఏ పుణ్యంబునఁ దుద ల
క్ష్మీపతి సంతుష్టుఁ డగుచు మేదిని నరులం
జేపట్టి యొసఁగు నిజపద
మా పుణ్యక్రమము దెలుపు మబ్జజ యనినన్.

116


గీ.

భువనసమితిలోన భూలోక మధికంబు
తెలియ నందు మేలు గలియుగంబు
తద్యుగమునఁ జక్రధరుభక్తి యణుమాత్ర
ముననె కలుగు ముక్తి మనుజులకును.

117


వ.

మఱియును సాధారణధర్మంబులు జాతిధర్మంబులు ననఁగ నాచారంబు
ద్వివిధం బై పర్యవసించు నందు సాధారణధర్మంబు లెవ్వి యనిన.

118


సీ.

దత్తానుతాపసంతప్తుఁ డై కుందక
        దీనార్థులకు నిచ్చు దాన మొకటి
విఘ్న మేతెంచుచో విడువక సూటిగా
        నిత్యంబు నడపెడి సత్య మొకటి
భువన మంతయుఁ జతుర్భుజుని రూపం బని
        పొలుపుగాఁ దలఁపోయు బుద్ది యొకటి
యాత్మలో నతిభక్తి నంబుజోదరు నామ
        ములు సర్వకాలంబునఁ దలఁచు టొకటి
మహిని వివరింప సర్వసామాన్యసరణు
లివియె తెరువులు వైకుంఠభవనమునకుఁ
గలుషసహితుని కైన దుష్కర్ము కైన
జాతిహీనుని కైనఁ బ్రఖ్యాతితోడ.

119


క.

ఇం దొక టైనను దప్పక
కందువతో నడప నేర్చు ఘను లెల్లను సం
క్రందననుతు లై మోక్షముఁ
బొందుదు రఖిలాఘకర్మపూరితు లైనన్.

120


వ.

మఱియు విప్రాదివర్ణధర్మంబు లెవ్వి యనిన.

121