Jump to content

పుట:మత్స్యపురాణము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

45


గీ.

సతులతోడఁ బాపి సుతులను దొలఁగించి
సిరులఁ జెందనీక శ్రీవిభుండు
తివిరి యాత్మభక్తి దృఢముగాఁ బరికించి
భక్తులకు నొసంగుఁ బరమపదము.

50


క.

ఆయువు కొంచెము సిరు లన
పాయంబులు గావు హృదయభయభావంబుల్
వాయవు భోగాసక్తుల
కాయాసమె కాని కలుగ దందు ఫలంబుల్.

51


మ.

భువిఁ గర్మంబులు సర్వదేవతలకుం బొల్పొందగా దృష్టిహే
తువు లై యా చరితంబు లయ్యెడియెడన్ దోరంబు లై విఘ్నముల్
వివిధోపాయబలంబులం దగులు నా విఘ్నంబు లాత్మక్రియా
నవవృత్తంబులఁ బొంది మోక్ష సరణిం దప్పించు నయ్యైయెడన్.

52


గీ.

ఖడ్గధారమీఁద గమనంబు సేయుచుఁ
పదిలుఁ డైన నరుని పగిది నాత్మ
యోగసరణిఁ జనుచు యుక్తుండు నిర్విఘ్న
ముగ వసించు మోక్షమున మునీంద్రా.

53


గీ.

జ్ఞానకర్మయోగసముదయంబు ప్రతిభ
కొలఁది గాని యొరులకును నిషిద్ధ
మగును జర్చ సేయ నఖిలాధికార మై
తనరు భక్తియోగ మనఘచరిత.

54


ఉ.

ధీనుత కర్మమార్గము విధిజ్ఞుల కైనఁ బ్రయాన మెట్టిచో
మానవుఁ డప్రమత్తతనను మాధవు నాత్మఁ దలంచి సంతత
స్వానుభవైకవేద్య మగు సత్వసుఖంబును బొంది రోయుఁ ద
న్మానుషసౌఖ్యసంపదలు నశ్వరహేతువు లంచు నెయ్యెడన్.

55


శా. ఉత్కంఠావృతు లై మహీసురులు తద్యోగక్రియాశూన్యు లై
సత్కార్యప్రియభావినిత్యసుఖవాంఛల్ మాని మోహంబునన్
దత్కాలంబునఁ గోర్కె చేపడుట కై నారాయణప్రీతిగాఁ
దత్కర్మంబులు సేయు టొల్లరు విచిత్రభ్రాంతచేతస్కు లై.

56