పుట:మత్స్యపురాణము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ద్వితీయాశ్వాసము


క.

జ్ఞాన మనన్ హరిపాద
ధ్యానానున్యూతభక్తి నలరుట తుద న
జ్ఞానమునాఁ దదితరసం
ధానము పరికింపఁ బడియె దత్వం బనఘా!

45


చ.

అతులిత పాపసంకలితుఁ డైనను జాతివిహీనుఁ డైనఁ గ
ర్మతతులబద్ధుఁ డైనఁ బితృమాతృజిఘాంసకుఁ డైన నిందిరా
పతి నతిభక్తితోఁ దలఁచి ప్రస్తుతిసేయఁగ నేర్చు మానవుం
డతిముద మంది చెందును బరాచ్యుతలోకనివాససౌఖ్యముల్.

46


క.

శ్రీనాథుభక్తిఁ బొదలెడు
మానవుఁ డఖిలామరేంద్రమానితుఁ డగుచున్
స్వానుభవావేద్యసుఖం
బానిన హృదయమున ముక్తి కరుగును బుత్త్రా.

47


సీ.

అజ్ఞాన మనెడు గాఢాంధకారసమూహ
       మంతయుఁ దుదిముట్ట నణఁచుకొఱకు
వివిధాన్యకృతమార్గవిధుల దుర్వాక్యముల్
       శ్రవణముల్ సోకక చనెడుకొఱకు
బహుజన్మపుణ్యసంప్రాప్తలక్ష్మీశ్వర
       పాదాబ్జసద్భక్తి ప్రబలుకొఱకు
నిబిడదుష్కృతజాలనిలయ మై వర్తించు
       విదితసంసారేచ్ఛ వదలుకొఱకు
బ్రదుకు మిథ్యగ మదిలోనఁ బరఁగుకొఱకుఁ
సజ్జనులతోడి సంసర్గ జరుగుకొఱకుఁ
బ్రతిదినంబును సంతోషభరితుఁ డగుచు
వినఁగవలయును దద్రమావిభుని కథలు.

48


క.

హరినామస్మరణకథా
పరిచయమునఁ బ్రొద్దుఁ గడపు భాగవతులు సు
స్థిరముగ లక్ష్మీరమణుని
పురమున వసియింతు రమరపూజితు లగుచున్.

49