Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 75


సీ.

నేఁ గొమ్ముటేనుఁగు నే విహగంబను, నే స్తబ్ధరోమంబ నేను గొఱియ
నేను బకంబను నేను గర్కటకంబ, నే నచ్ఛభల్లంబ నేను నక్క
నేను మండూకంబ నేను గించుళికంబ, నేను గీటంబ నే వానరంబ
నే శుకకీటంబ నేఁ బుండరీకంబ, నే ఖంజరీటంబ నేను దోమ


తే.

నేను మానిసి మున్నంచు నేకతమున, నొండొరులతోడు తను జెప్పుకొండు రుబుసుఁ
దారక బ్రహ్మమణిపేటి దక్షవాటి, సంభవించిన ప్రత్యగ్రచంద్రధరులు.

33


తే.

అఖిలతీర్థప్రదేశంబు లడవు లిండ్లు, యజ్ఞవాటిక వల్లకా డనువిభేద
మించుకయు లేదు భీమనాథేశభూమి, జంతువులు శంభులగుదురు చచ్చినపుడు.

34


శా.

సాక్షాద్దక్షిణకాశికానగరి దక్షస్థాన మవ్వీటిలో
మోక్షార్థాక్షరదీక్ష నక్షయసుఖంబుం ప్రాణికిన్ సత్కృపా
వీక్షాసంకలితానురాగుఁ డగుచున్ విశ్వేశుచందంబునం
ద్ర్యక్షుం డీశుఁడు భీమనాథుఁ డొసఁగుం బ్రాణావసానంబునన్.

35


శా.

శ్రీభీమేశ్వరపాదపీఠవిలుఠచ్ఛ్రీసప్తగోదావర
వ్యాభుగ్నోర్మిపరంపరాఘుమఘుమప్రారంభకోలాహల
క్షోభోద్వేజితపాతకౌఘము జగచ్చూడావతంసంబు ల
క్ష్మీభద్రాసన మొప్పు దక్షనగరీక్షేత్రంబు ధాత్రీస్థలిన్.

36


వ.

అని నారదుండు చెప్పిన విని తపోధనులు భీమనాథుమాహాత్మ్యంబునకు దక్షారామప్రభావంబునకు సప్తగోదావరమహిమంబునకు విస్మయంబందియు దర్శించియు నమస్కరించియు ధన్యులైన యాత్మారాము లమ్మహారామంబునఁ జరియించువారును నగుచు సత్యవతీసుతుం గాంచి దక్షారామాయణుండైన బాదరాయణువలన నప్పుణ్యస్థానంబున మఱియుం గల యశేషవిశేషంబు లెఱింగి.

37


చ.

అటఁ జని యొక్కచోటఁ గమలాననబంధము పూని వాహినీ
తటమున బిల్వకాననలతాగృహమధ్యమునందు నాసికా
పుటశిఖరాగ్రదృష్టి యగు పుణ్యుని గాంచిరి మౌనిపుంగవుల్
ఘటమున నుద్భవించిన యగస్త్యు యశోనిధి నిల్వలాంతకున్.

38


వ.

తదనంతరంబ యతనితో సల్లాపంబుల నపనయించి తీర్థమాహాత్మ్యం బడిగిన నతం డిట్లనియె.

39

అగస్త్యుఁడు తీర్థమాహాత్మ్యంబుఁ జెప్పుట

సీ.

జహ్నుకన్యాతీరసన్నివేశమునకు, దక్షిణాంభోరాశితటముసాటి
కమనీయమణికర్ణికాప్రవాహమునకు, సప్తగోదావరజలముసాటి